రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు శోభారాణి
జమ్మికుంట, ఫిబ్రవరి 15: అంగన్వాడీల సేవలు అమూల్యమని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడంలో వారిది కీలకపాత్రని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు శోభారాణి కొనియాడారు. మంగళ వారం పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ తిరుమల ఆధ్వర్యంలో ‘పిల్లల్లో తీవ్ర లోప పోషణ నివారణ’ అవగాహన సదస్సును నిర్వహించారు. సదస్సుకు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పిల్లల్లో పోషకాహార లోపం లేకుండా చూసుకోవాలని తెలిపారు. తల్లీ, బిడ్డకు సకాలంలో పోషకాలు అందేలా చూడాల్సిన బాధ్యత అంగన్వాడీలపై ఉందన్నారు. పిల్లలకు ఎక్కువ క్యాలరీలు, ప్రోటీన్లతో కూడిన ఆహారం అందించాలని సూచించారు. ప్రభుత్వం సమకూరుస్తున్న సరుకులను గర్భిణులు, పిల్లలు, తల్లులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోషకాహార భద్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమని, ఎవరూ పోషకాహార లోపానికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని డీడబ్ల్యూవో పద్మావతి, డీటీ సమ్మయ్య, వావిలాల పీహెచ్సీ వైద్యాధికారి తులసీదాస్, కేవీకే శాస్త్రవేత్త ప్రశాంతి తెలిపారు. సరైన సమయంలో సమతుల ఆహారం తీసుకోవడంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. తీసుకునే ఆహారంలో వైవిధ్యం పెరుగాలని పేర్కొన్నారు. తర్వాత పిల్లలకు అన్నప్రాసన చేశారు. ఇక్కడ మున్సిపల్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు చెందిన టీచర్లు, ఆయాలు, సిబ్బంది, తల్లీబిడ్డలు, తదితరులు పాల్గొన్నారు.