గురువారం 25 ఫిబ్రవరి 2021
Jayashankar - Dec 17, 2020 , 01:56:13

పల్లె ప్రగతిలో ‘నవాబు’

పల్లె ప్రగతిలో ‘నవాబు’

  • అభివృద్ధిబాటలో నవాబుపేట 
  • నిధులు మంజూరు చేసిన ఎన్‌జీటీ
  • సీసీ కెమెరాలు, సీసీ రోడ్ల నిర్మాణం

చిట్యాల, డిసెంబర్‌ 16 : గ్రామాల్లో పచ్చని వాతావరణాన్ని నెలకొల్పడంతో పాటు గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఏర్పాటు దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్ష మేరకు గ్రామాలు హరిత వనాలుగా తీర్చిదిద్దుకుంటున్నాయి. మౌలిక వసతుల ఏరాటు కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పల్లె ప్రగతి’లో కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా మండలంలోని నవాబుపేటలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం గ్రామస్తులతో పాటు సందర్శకులను ఆకర్షిస్తున్నది. గ్రామాభివృద్ధిని పరిశీలించిన ఎన్‌జీటీ (నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌) గత సంవత్సరం జూలైలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో నవాబుపేట, ఎడవెల్లి, రంగాపూర్‌ గ్రామాలను ఎంపిక చేసింది. ప్రత్యేక నిధులు, గ్రామంలో పరిశుభ్రతను పాటించేందుకు సామగ్రిని అందజేసేందుకు నిధులు విడుదల చేసింది. అందులో భాగంగానే నవాబుపేట గ్రామానికి రూ.3.50 లక్షలు, ఇంటింటికీ తడి, పొడి చెత్త డబ్బాలను అందజేసింది.

 రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మరింత ప్రగతి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనం, సెగ్రిగేష్‌న్‌షెడ్‌, మన ఊరు మన నర్సరీ, వైకుంఠధామం, బతుకమ్మ విగ్రహం గ్రామంలో నిర్మించిన తీరు గ్రామాభివృద్ధికి చిహ్మాలుగా నిలుస్తున్నాయి. ఎన్‌జీటీ నిధులతోపాటు నెలనెలా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న నిధులతో గ్రామం అభివృద్ధి చెందుతున్నది.  అంతేకాకుండా సర్పంచ్‌ కసిరెడ్డి సాయిసుధ తన సొంత నిధులు సైతం గ్రామాభివృద్ధికి ఖర్చుచేస్తున్నారు.   గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు, వందశాతం సీసీ రోడ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దీనికి తోడు గ్రామ శివారులోని రోడ్లకు ఇరువైపులా మూడు కిలోమీటర్ల వరకు రెండు వేల మొక్కలు హరితహారంలో భాగంగా నాటి సంరక్షిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలోని గోడలపై పాఠ్యాంశంలోని బొమ్మలు చిత్రీకరించారు. 

చేపట్టాల్సిన పనులు

అభివృద్ధిలో దూసుకుపోతున్న గ్రామాన్ని గుర్తించిన ప్రపంచ బ్యాంకు గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిసింది. త్వరలో గ్రామంలో 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌ నిర్మించనున్నారు. వంకసముద్రం చెరువును ట్యాంక్‌బండ్‌గా నిర్మించేందుకు కృషి చేస్తున్నారు.

అందరి సహకారంతోనే గ్రామాభివృద్ధి

అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నా. సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష మేరకు గ్రామం పచ్చగా తీర్చిదిద్దుకుంటుంది. గ్రామస్తుల సమష్టి కృషితోనే గుర్తింపు వచ్చింది. రానున్న రోజుల్లో గంగాదేవిపల్లిలా నవాబుపుపేటను నిలుపుతా. అధికారులు, ప్రజాప్రతినిధులు తమవంతు సహకారం అందించాలి.     

- కసిరెడ్డి సాయిసుధ, నవాబుపేట సర్పంచ్‌ 

అభివృద్ధి పనులు అభినందనీయం..

గ్రామంలో జరుగుతున్న పనుల వేగవంతం అభినందనీయం. ప్రభుత్వ పథకాల అమల్లో సర్పంచ్‌ పాత్ర కీలకంగా ఉంది. ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూడకుండా సొంత నిధులతో గ్రామాభివృద్ధి పాటుపడటం హర్షనీయం. మండలంలో ఉన్న గ్రామాలు నవాబుపేటలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆదర్శంగా తీసుకోవాలి.

- రవీంద్రనాథ్‌, ఎంపీడీవో చిట్యాల     

VIDEOS

logo