Kareena Kapoor | అగ్ర కథానాయిక కరీనాకపూర్ రాసిన ‘కరీనాకపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్’ పుస్తకం వివాదాల్లో చిక్కుకుంది. ఈ పుస్తకం టైటిల్ ఓ వర్గం ప్రజల మనోభావాలను కించపరిచేలా ఉందంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన న్యాయవాది క్రిష్టోఫర్ ఆంథోని అక్కడి హైకోర్టులో కేసు వేశారు. బుక్ టైటిల్లో ‘బైబిల్’ అనే పదాన్ని ఉపయోగించడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. “బైబిల్’ ప్రచంచవ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్ల పవిత్రగ్రంథం. పబ్లిసిటీ కోసం కరీనాకపూర్ ‘బైబిల్’ పేరును వాడుకుంటోంది. వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలి’ అని క్రిష్టోఫర్ ఆంథోని తన పిటిషన్లో పేర్కొన్నారు.
దీనిని పరిశీలించిన న్యాయస్థానం కరీనాకపూర్‌తో పాటు పుస్తక ప్రచురణ సంస్థకు నోటీసులు జారీ చేసింది. కరీనాకపూర్ రాసిన ఈ పుస్తకం 2021లో విడుదలైంది. ఆ సమయంలో క్రిష్టోఫర్ ఆంథోని క్రింది కోర్టులలో వేసిన పిటిషన్స్ చెల్లలేదు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. టైటిల్లో ‘బైబిల్’ పదాన్ని ఎందుకు ఉపయోగించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని కోర్టు నోటీసుల్లో పేర్కొంది. గర్భిణులు పాటించాల్సిన ఆహార నియమాలు, ఫిట్నెస్ సీక్రెట్స్‌తో పాటు శారీరక, మానసిక సమస్యలను ఎలా అధిగమించాలనే విషయాలను చర్చిస్తూ కరీనాకపూర్ ఈ పుస్తకాన్ని రచించారు.