అంధకారాన్ని చీల్చిన కాంతిరేఖలు కనుమరుగైనయ్. వెలుగు జిలుగుల రాష్ర్టాన్ని మళ్లీ కరెంటు చీకట్లు కమ్ముకున్నయ్. అప్రకటిత కోతలు మొదలైనయ్. సబ్స్టేషన్లు ధర్నాలతో దద్దరిల్లుతున్నయ్. ట్రాన్స్ఫార్మర్లు పేలుతున్నయ్.. మోటర్లు కాలుతున్నయ్.. పంటలెండుతున్నయ్.. జనం మళ్లీ ఇన్వర్టర్లు కొంటున్నరు.. పారిశ్రామికవాడలు వణుకుతున్నయ్. ఇన్వెస్టర్లు వాపస్ పోతున్నరు. ఇదీ రాష్ట్రంలోని తాజా పరిస్థితి. రెప్పపాటు కూడా కరెంటుపోని తెలంగాణ నిన్నటి వెలుగుల వైభవం. కండ్లముందే చీకట్లు అలుముకుంటున్న విషాద దృశ్యం ఇప్పుటి కటిక నిజం.
Power Cuts | హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ సర్కారు హయాంలో ఇన్వర్టర్లు పాయె.. ఇన్వెస్టర్లు వచ్చే అన్నట్టు పరిస్థితులు ఉండేవి. రాష్ట్రంలో రెప్పపాటు కూడా కరెంట్ పోయేది కాదు. ఇన్వర్టర్ల సంస్కృతి మార్చి.. ఇన్వెస్టర్లకు రెడ్‌కార్పెట్ పరిచింది. నిరంతర విద్యుత్తు ఫలితంగా రాష్ర్టానికి ఇన్వెస్టర్లు క్యూకట్టారు. కానీ, రేవంత్ సర్కారు కొలువుదీరిన తర్వాత తెలంగాణ పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ఒకవైపు ఇన్వెస్టర్లు వెళ్లిపోతుండగా, ప్రజలు మళ్లీ ఇన్వర్టర్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. కాంగ్రెస్ పుణ్యమా అని ఇన్వర్టర్ల కొనుగోళ్లు మళ్లీ ఊపందుకున్నాయి. కార్నింగ్ పరిశ్రమ తమిళనాడుకు వెళ్లిపోయింది. ఐదారు కంపెనీలు గుజరాత్‌కు పోతున్నాయని సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి పలు సభల్లో వెల్లడించారు.
మోటర్ రిపేర్ షాపులకు గిరాకీ
లోవోల్టేజీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. మోటర్లు మొదలుకుని గృహోపకరణాల వరకు అన్నీ కాలిపోతున్నాయి. ఆఫ్ కరెంట్‌తో అవస్థలొచ్చిపడ్డాయి. ఇంతకాలం గిరాకీ కరువైన మోటర్ వైండింగ్షాపులకు గిరాకీ పెరిగింది. మోటర్లు కాలుడు, బావుల్లో నుంచి పైకి గుంజుడు.. మెకానిక్ షాపుల్లో పడిగాపులు పడే స్థితికి రైతుల పరిస్థితి దిగజారింది. 24 గంటల కరెంట్‌తో ఇంతకాలం మోటర్ మెకానిక్ షాపులు వెలవెలబోయాయి. చాలా వరకు మూతబడ్డాయి. ఇప్పుడు అవే షాపులు మళ్లీ పురుడోసుకుంటున్నాయి. పదే పదే మోటర్లు కాలటంతో రైతులు అప్పులపాలు అవుతున్నారు.
రాత్రిపూట కరెంటు కోసంబావుల వద్దకు
గతంలో 24 గంటల కరెంటుతో రైతులు ఉదయాన్నే పొలాలకు వెళ్లి నీరు పారించేవారు. రైతులు ధీమాగా ఉండేవారు. కానిప్పుడు రాత్రిపూట త్రీఫేజ్ కరెంట్ ఇస్తున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఇచ్చే త్రీఫేజ్ కరెంటు కోసం రైతులు రాత్రి పూట పొలాల వద్ద పడుకుంటున్నారు. టార్చిలైట్లు పట్టుకుని పొలాల వద్ద పడిగాపులు పడుతున్నారు. రైతుల జీవితం రాత్రిపూట బావుల వద్దే అన్నట్టుగా తయారైంది. పాముకాట్లు, విద్యుత్తు షాక్‌లు, మరణాలు సంభవించే కాలం మళ్లీ వచ్చేసింది.
విద్యార్థుల జీవితం అంధకారం
ఇప్పుడున్నది పరీక్షల సమయం. పోటీ పరీక్షల సీజన్ కావటంతో విద్యార్థులంతా పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. కాంగ్రెస్ తెచ్చిన కరెంట్ కోతలతో ప్రశాంతంగా చదువుకునే పరిస్థితి కరువైంది. అంతేకాదు పరీక్షల ఆలస్యమవుతున్నాయి. కరెంట్ కోతలతో మధ్యాహ్నం జరగాల్సిన పరీక్షలు రాత్రి వరకు నిర్వహించాల్సి వస్తున్నది. కరెంటు కోతల ప్రభావంతో ఇటీవల కరీంనగర్లో ఎప్‌సెట్ పరీక్షను రాత్రి 8 గంటల వరకు నిర్వహించాల్సి వచ్చింది. సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తల్లిదండ్రులు రాస్తారోకో చేశారు. వరంగల్, నల్లగొండ జిల్లాల్లో 15 నిమిషాలు ఆలస్యమైంది. యూపీఎస్‌లు, మొబైల్ జనరేటర్లతో పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది.
రైతులే రిపేర్లు చేసుకునే దుస్థితి
విద్యుత్తు సంస్థల్లో ఐఏఎస్‌ల రాజ్యం నడుస్తున్నది. దీంతో పర్యవేక్షణ అదుపు తప్పింది. కాంగ్రెస్ పాలనలో విద్యుత్తు కోతలు, ఫ్యూజులు పోవటం ఇప్పుడు కామన్ అయ్యాయి. స్థానికంగా విద్యుత్తు సిబ్బంది అందుబాటులో లేకపోవటంతో రైతులే లైన్మెన్ల అవతారమెత్తుతున్నారు. కరెంట్ స్తంభాలు ఎక్కి, లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ చేసుకుంటున్నారు. మెదక్ జిల్లాలోని తొగుట మండలంలోని వెంట్రావుపేటలో రైతు కత్తుల రాములు ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేయాల్సి వచ్చింది. రైతులు బావికి ఇంత చొప్పున వేసుకుని ట్రాన్స్ఫార్మర్లు తెచ్చుకుని బిగించుకుంటున్నారు.
పొలాలకు నిప్పు
కరెంట్ కోతల ఫలితంగా యాసంగిలో పంటలెండిపోయాయి. పంట ఉత్పిత్తి తగ్గిపోతున్నది. రాష్ట్రంలో మళ్లీ దుర్భిక్షపు ఛాయలు, ఆహార కొరత దుస్థితి దగ్గరలోనే ఉన్నాయి. నీరందక పంటలు ఎండిపోవటంతో పొలాల్లో పశువులను మేపుడు, కాలబెట్టుకునుడు సంస్కృతి మళ్లీ పునరావృతమైంది. ఎండిన పంటలను చూడలేక ఓ రైతు రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరి పొలానికి నిప్పుపెట్టారు. తొమ్మిదేండ్లలో ఏనాడూ ఇలాంటి ఘటనలు జరగలేదు. ఇప్పుడు ఐదు నెలల్లోనే పరిస్థితి మారిపోయింది.
సబ్స్టేషన్ల ముందు ధర్నాలు
విద్యుత్తు కోతలతో జనం, రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. దీంతో రాష్ట్రంలో సబ్స్టేషన్ల ముట్టడి, ధర్నాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా చినుకు పడితే చీకటే అన్నట్టు పరిస్థితి తయారైంది. నాలుగు చినుకులు పడితే నాలుగు గంటలు చీకట్లో మగ్గిపోయే పరిస్థితులు వచ్చాయి. ఇటీవలే మియాపూర్ మాతృశ్రీనగర్‌లో 12 గంటలు కరెంట్ లేకపోవడంతో జనం సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. నిర్మల్ జిల్లా భైంసా సమీపంలోని ఓ గ్రామ రైతులు ధర్నా, రాస్తారోకోకు దిగారు. ఖానాపూర్‌లో సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. నల్లగొండ జిల్లా త్రిపురారంలోను రైతులు రోడ్డుపై రాస్తారోకోను నిర్వహించారు.
మళ్లీ జనరేటర్ల కాలం
కాలనీల్లో, గృహసముదాయాల్లో కరెంట్ కోతలు కష్టాలు తెచ్చిపెట్టాయి. మరీ ముఖ్యంగా అపార్ట్మెంట్లల్లో ఇంతకాలం మూలనపడ్డ జనరేటర్లు ఇప్పుడు తాండవం చేస్తున్నాయి. డీజిల్ బిల్లులు మోత మోగిస్తున్నాయి.
పరిశ్రమల విలవిల
పవర్‌కట్స్‌తో పరిశ్రమలు విలవిల్లాడుతున్నాయి. ఇంతకాలం ధీమాగా నడిచిన చిన్నాచితకా పరిశ్రమలిప్పుడు కరెంటో రామచంద్రా అని మొత్తుకుంటున్నాయి. ఇంతకాలం లాభాల్లో నడిచిన పరిశ్రమలకు ఆర్థిక నష్టాలు, కష్టాలు వచ్చిపడ్డాయి. మధ్యలోనే ప్రాసెస్ నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నాయి. పారిశ్రామికవేత్తలు కోతల్లేని విద్యుత్తు ఇవ్వాలని సీఎంను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో తెలుస్తున్నది.
సగం ఫిల్టర్ నీళ్లు
కరెంట్ కోతల ఎఫెక్ట్ తాగునీటి సరఫరా వ్యవస్థలపైనా పడుతున్నది. కోతలతో ఫిల్డర్ బెడ్స్ నిర్వహణ కష్టమవుతున్నది. దీంతో సగం ఫిల్టర్ అయిన నీళ్లనే ప్రజలకు అందిస్తున్నారు. నల్లా నీరు మురుగు వాసన వస్తున్నది. దీంతో ప్రజలు రోగాల బారిన పడాల్సి వస్తున్నది. తప్పనిసరి పరిస్థితుల్లో మినరల్ వాటర్ క్యాన్లు కొంటున్నరు.
మంత్రులు, ఎమ్మెల్యేలకూ తప్పని బాధలు
సామాన్యులే కాదు.. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం విద్యుత్తు కోతల బారినపడ్డారు. సాక్షాత్తు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విద్యుత్తు కోతల ప్రభావానికి గురయ్యారు. తాను పర్యటించిన చోట 8, 9 సార్లు కరెంట్ పోయిందని ఆయన ‘ఎక్స్’లో తెలిపారు. ఆదిలాబాద్‌లో కేంద్రమంత్రి అర్జున్‌ముండా, వరంగల్‌లో మంత్రి సీతక్క, భూపాలపల్లి జిల్లాలో మంత్రి శ్రీధర్‌బాబు సెల్‌ఫోన్ లైట్ల వెలుగులో పర్యటించాల్సి వచ్చింది. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం విద్యుత్తు కోతలతో మధ్యలోనే నిలిచిపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. అక్కడక్కడ సమావేశాల మధ్యలో కరెంట్ పోతే సెల్ఫోన్ల ఫ్లాష్ల మధ్యే కొనసాగుతున్నాయి.