Oscar Awards | ప్రపంచ సినిమాలో ఆస్కార్ పురస్కారాలను తలమానికంగా భావిస్తారు. వివిధ దేశాలకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఆస్కార్‌ను గెలుచుకోవడం తమ లైఫ్‌టైమ్ డ్రీమ్‌గా చెప్పుకుంటారు. అంతటి పేరుప్రఖ్యాతులు కలిగిన ఆస్కార్ పురస్కారాల శతాబ్ది ఉత్సవాల కోసం సన్నాహాలు మొదలయ్యాయి. 2028లో నిర్వహించనున్న ఆస్కార్ అవార్డుల వందో వేడుక కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.
ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆస్కార్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా 500 మిలియన్ డాలర్లను (దాదాపు నాలుగువేల కోట్లు) సేకరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే వంద మిలియన్ల డాలర్లను సేకరించామని, ప్రపంచ సినిమా చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయేలా ఈవెంట్‌కు సన్నాహాలు చేస్తున్నామని ఆస్కార్ కమిటీ సీఈఓ బిల్ క్రామోర్ ఇటీవలే వెల్లడించారు. గత మార్చిలో 96వ ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవం జరిగిన విషయం తెలిసిందే. 97వ ఆస్కార్ అవార్డుల వేడుక వచ్చే ఏడాది మార్చి 2న జరగనుంది.