Lok Sabha Elections | హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో లోక్‌సభ సమరానికి సర్వం సిద్ధమైంది. 17 లోక్‌సభ స్థానాలు, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 3.32 కోట్లమంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 35,809 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల బరిలో 525 మంది అభ్యర్థులుండగా వీరిలో 50 మంది మహిళలున్నారు. కంటోన్మెంట్ అసెంబ్లీ పరిధిలో 2.51లక్షల మంది ఓటర్ల కోసం 232 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు,106 నియోజకవర్గాల్లో సా.6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా ఆదివారం సాయంత్రానికే సిబ్బంది కేంద్రాలకు చేరుకున్నా రు. సోమవారం ఉదయం 5.30 గంటల నుంచి రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి అసలు ప్రక్రియను ప్రారంభిస్తారు.జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుం ది. పోలింగ్ సందర్భంగా రాష్ట్ర పోలీసులు, ఇతర రాష్ర్టాల పోలీసులు,కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలు మోహరించాయి.
ఓటేసిన 2,08,163 మంది
రాష్ట్రంలో ఇప్పటికే 2,08,163 మంది ఓటేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కల్పించిన హోం ఓటింగ్ వెసులుబాటుతో దివ్యాంగులు, 85 ఏండ్లు పైబడినవారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1.88 లక్షల మంది ఉద్యోగులు సైతం ఓటేశారు. అన్ని విభాగాలకు చెందిన 2.94 లక్షల మంది పోలింగ్ విధులు నిర్వర్తిస్తున్నారు. అంతటా ఈవీఎంల ద్వారానే పోలింగ్ జరగనుంది. లోక్‌సభ స్థానాలకు తెలుపు బ్యాలెట్ పేపర్‌ను వినియోగిస్తున్నారు.
మోడల్ పోలింగ్ కేంద్రాలు : 644
ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికల సంఘం 644 మోడల్ పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది. అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం ఐదు మోడల్ కేంద్రాలు ఉంటాయి. స్థానికత ఉట్టిపడేలా వీటిని తీర్చిదిద్దారు. 597 కేంద్రాల్లో మహిళలు, నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 సెంటర్లలో దివ్యాంగులు, 119 పోలింగ్ కేంద్రాల్లో యువతీయువకులే పూర్తిగా విధులు నిర్వర్తించనున్నారు.
పోలింగ్ శాతంపై ఆందోళన
పార్లమెంట్ ఎన్నికలపై ఓటర్లలో అనాసక్తి కారణంగా పోలింగ్ శాతం తగ్గుతుందని అటు రాజకీయ పార్టీలు, ఇటు అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఉండటంతో ఇక్కడ అక్కడ రెండు చోట్ల ఓటు హక్కు ఉన్న వారు ప్రస్తుతం అక్కడే ఓటు హక్కు వినియోగానికి ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్‌లో పనిచేసే బెంగాల్, ఒడిశా, బీహార్, యూపీ రాష్ర్టాలకు చెందిన కార్మికులు, ప్రైవేట్ ఉద్యోగులు కూడా సొంత ఊర్లకు పయనమయ్యారు. ఈ ప్రభావం హైదరాబాద్‌లో ఓటింగ్ శాతంపై పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2019 లో దేశంలో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదైన నియోజకవర్గాలుగా జీహెచ్ఎంసీ పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల జాతీయ స్థాయి టాప్ 50లో నిలిచాయి.
ఎండాకాలం ఏర్పాట్లు
ఎండాకాలం కావడంతో పోలింగ్ కోసం ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కుర్చీలు, టెంట్లు, షామియానాలు, ఫ్యాన్లను అందుబాటులో ఉంచింది. సాయంత్రం 6 వరకు క్యూలో నిలుచుకున్న వారు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు రాత్రిపూట ఇబ్బంది పడకుండా లైటింగ్ సౌకర్యం కల్పించింది. వృద్ధులు, దివ్యాంగులకు సేవలందించేందుకు వలంటీర్లను నియమించింది.
ఓటెక్కడుందో తెలుసుకోవాలంటే!
అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కు వినియోగించుకున్నారో అదే కేంద్రంలో లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేలా ఈసీ ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాలను మార్చలేదని ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఓటర్లు అయోమయానికి గురికాకుండా ఉండేందుకే కేంద్రాల్లో ఎలాంటి మార్పు చేయలేదని వివరించారు. ఓటర్లు పోలింగ్ కేంద్రం, సీరియల్ నంబర్లను తెలుసుకునేందుకు ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 1950 నంబర్‌కు ECI అని టైప్ చేసి ఓటరు కార్డు నంబర్‌ను ఎంటర్ చేసి ఎస్ఎంఎస్ పంపిస్తే పోలింగ్ కేంద్రం, సీరియల్ నంబర్ వెంటనే ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఓటరు హెల్ప్ లైన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని సెర్చ్ యువర్ దగ్గర క్లిక్ చేసి మొబైల్ నంబర్ లేదా ఓటరు కార్డు నంబర్ లేదా ఇతర వివరాలు, లేదా బార్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా పోలింగ్ కేంద్రం, సీరియల్ నంబర్ తెలుస్తాయి.
రాష్ట్రంలో ఓటర్ల వివరాలు
మొత్తం ఓటర్లు ; 3,32,32,318
గతంలో లోక్‌సభ పోలింగ్ శాతం
సంవత్సరం పోలింగ్ శాతం
లోక్‌సభ నియోజకవర్గం 2019లో ఓటింగ్ శాతం
లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఓటర్ల సంఖ్య