ఆదివారం 24 మే 2020
Jayashankar - Feb 19, 2020 , 03:55:12

శివోహం!

శివోహం!

‘మహా’ జాతరకు ముహూర్తం దగ్గర పడుతున్నది. దక్షిణ కాశీ శైవ క్షేత్రం, కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి దేవస్థానం ముస్తాబవుతున్నది. రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల నుంచి ఈ శివరాత్రికి సుమారు 2 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకోనుండగా, అందుకు తగిన వసతుల కల్పనలో ఆలయ అధికార గణం నిమగ్నమవుతున్నది.

  • ‘మహా’ జాతరకు వేళాయె
  • కాళేశ్వరంలో ఫిబ్రవరి 20 నుంచి 22 వరకు ఉత్సవాలు
  • ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

‘మహా’ జాతరకు ముహూర్తం దగ్గర పడుతున్నది. దక్షిణ కాశీ శైవ క్షేత్రం, కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి దేవస్థానం ముస్తాబవుతున్నది. రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల నుంచి ఈ శివరాత్రికి సుమారు 2 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకోనుండగా, అందుకు తగిన వసతుల కల్పనలో ఆలయ అధికార గణం నిమగ్నమవుతున్నది. శివరాత్రి ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేయగా, ఫిబ్రవరి 20 నుంచి 22 వ తేదీ వరకు కాళేశ్వరం దేవస్థానంలో జరిగే జాతరను ఘనంగా జరుపుకునేందుకు అంగరంగ వైభవంగా ఆలయంను తీర్చిదిద్దుతోంది. త్రివేణి సంగమ గోదావరి తీరంతోపాటు ఆలయ పరిసరాల్లో భక్తుల కోసం ప్రత్యేక వసతులు ఏర్పాటు చేస్తోంది.              -కాళేశ్వరం విలేకరి


సుమారు 2 లక్షల మంది దర్శనం

ఈ మహా శివరాత్రి పర్వదినం రోజున కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి దేవస్థానాన్ని సుమారు 2 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారని ఆలయ అధికారులు అంచనా వేశారు. పక్క రాష్ర్టాలైన మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌ ప్రాంతాల ప్రజలకు ఈసారి గోదావరి నదిపై వంతెన అందుబాటులోకి రావడంతో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆలయంను రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరిస్తున్నారు. ఆలయానికి వచ్చి జాగారం ఉండే భక్తులకు కాలక్షేపం కోసం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి నది వద్ద భక్తుల కోసం చలువ పందిళ్లు, స్త్రీలు బట్టలు మార్చుకునేందుకు తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం స్థానిక హనుమాన్‌ గుడి సమీపంలోని ఖాళీ స్థలాన్ని పార్కింగ్‌ కోసం కేటాయించారు. అలాగే వీఐపీలకు దేవస్థానం పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని పార్కింగ్‌ కోసం కేటాయించారు. వికలాంగులకు నేరుగా గోదావరి నది వద్దనే వాహన పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. 


భక్తులు ఇలా చేరుకోవచ్చు

వరంగల్‌, భూపాలపల్లి జిల్లాల ప్రజలు కాటారంనకు వచ్చాక, అక్కడ నుంచి 30 కి.మీ. ప్రయాణిస్తే కాళేశ్వరానికి చేరుకోవచ్చు. మంథని నుంచి 70 కి.మీ. మంచిర్యాల జిల్లా నుంచి 40 కి.మీ. నిడివిలో కాళేశ్వరానికి చేరుకోవచ్చు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల ప్రజలు చెన్నూరు మీదుగా కేవలం 15 కి.మీ. దూరంలోనే పల్గుల, కుంట్లం వద్ద తాత్కాలిక వంతెన మీదుగా చేరుకోవచ్చు. ఛత్తీస్‌గఢ్‌ ప్రజలు 60 కి.మీ దూరంలో ఉన్న ఇంద్రావతి నదిపై ఉన్న తాత్కాలిక వంతెన మీద నుంచి చేరుకోవచ్చు. ఇక గోదావరి నదిపై ఇటీవల ప్రారంభమైన వంతెన మీద నుంచి మహారాష్ట్ర, సిరివంచ నుంచి భక్తులు చేరుకుంటారు. 


భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నాం

ఈ మహా శివరాత్రికి 2 లక్షల వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. ఆలయ పరిసరాల్లో పారిశుధ్యం లోపించకుండా ఎప్పటికప్పుడు సిబ్బందిని అందుబాటులో ఉంచడం, వైద్య సిబ్బంది సేవలు, భక్తులకు తాగునీరు తదితర వసతుల కల్పనకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో బందోబస్తు కల్పిస్తున్నారు. వలంటీర్లు కూడా భక్తులకు సేవలందించవచ్చు.   -మారుతి, ఆలయ ఈవో


logo