వాషింగ్టన్, మార్చి 13: ట్రంప్ హయాంలో మూడు విధానపరమైన నిర్ణయాల వల్ల హెచ్1బీ వంటి వీసాలు తిరస్కరణకు గురైన విదేశీ ఉద్యోగుల అభ్యర్థనలను, అభ్యంతరాలను తిరిగి పరిశీలిస్తామని అమెరికాలోని బైడెన్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు అమెరికా పౌరసత్వం, వలస సేవల సంస్థ (యూఎస్సీఐఎస్) శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయంతో వేల మంది భారతీయ ఐటీ నిపుణులకు ప్రయోజనం చేకూరనున్నది. స్థానిక అమెరికన్లకు ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో ట్రంప్ సర్కారు కఠినమైన వలస విధానాన్ని అనుసరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాటి కఠిన, వివక్షాపూరిత నిబంధనల కారణంగా అనేకమంది వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఇప్పుడు వీరి అభ్యర్థనలను తిరిగి సమీక్షించాలని తాజాగా బైడెన్ సర్కారు నిర్ణయించింది. హెచ్1బీ అనేది నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా. దీని కోసం భారతీయులే ఎక్కువగా పోటీపడుతుంటారు.