సోమవారం 06 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 11, 2020 , 02:11:37

మరుబెల్లికి పూనుగొండ్ల ముస్తాబు

మరుబెల్లికి పూనుగొండ్ల ముస్తాబు

కొత్తగూడ/ గంగారం, ఫిబ్రవరి 10: గిరిజనుల ఆరాధ్య దైవ్యం, సమ్మక్క భర్త పగిడిద్దరాజు జాతర అంగరంగ వైభవంగా రేపు (బుధవారం) ప్రారంభం కానుంది. గంగారం మండలం పూనుగొండ్లలో మరుబెల్లి కార్యక్రమాన్ని గిరిజన సంస్కృతీ సంప్రదాయాల మధ్య నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మేడారం మహాజాతర నేపథ్యంలో పూనుగొండ్ల నుంచి పెనక వంశీయులు, కల్తీ వంశీయులు, వడ్డెలు పగిడి ద్దరాజును మేడారం తీసుకెళ్లి, తిరిగి పూనుగొండ్లకు తీసుకొచ్చాక మరుబెల్లి కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. కాగా, పూనుగొండ్లలో ఈనెల 12న ఉపవాసం, గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.  పగిడిద్దరాజు గుట్ట నుంచి పగిడిద్దరాజు ప్రతిమను పూజారులు తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్ఠిస్తారు. 13న గురువారం స్వామివారి ఊరేగింపు, గంగస్నానం చేపడతారు. 14న శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మొక్కులు సమర్పిస్తారు. తిరిగి రాత్రి వనప్రవేశం నిర్వహిస్తారు. పూర్వం వేటకు వెళ్లినప్పుడు అలిసిపోయిన గిరిజనులకు ఓ బండారి వృక్షం కింద బంగారు ఉంగరం కనిపించిందని ఆ ఉంగరాన్ని గ్రామంలోకి తీసుకొచ్చిన తర్వాత ‘పగిడిద్దరాజును వెలిశాను’ అంటూ ఓ వ్యక్తి పూనకంతో చెప్పినట్లు కథ ప్రచారంలో ఉంది. తనను నా ల్గొవ గొట్టు వంశీయులు పూజిస్తే కోరిన కోర్కెలు తీరుస్తానంటూ పగిడిద్దరాజు చెప్పారని గిరిజ నుల నమ్మకం. అప్పటి నుంచి ప్రతీ రెండేళ్లకో సారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంలో పగిడిద్దరాజు వివాహం జరిపిస్తారు. ఆ తర్వాత తిరిగి పూనుగొండ్లకు తీసుకొచ్చి మరుపెళ్లి, జా తర ఘనంగా నిర్వహిస్తారు. 


logo