సోమవారం 30 మార్చి 2020
Jangaon - Mar 22, 2020 , 03:30:46

జనం కోసమే కరోనా కర్ఫ్యూ

జనం కోసమే కరోనా కర్ఫ్యూ

  • స్వీయ నియంత్రణ పాటిద్దాం
  • వైరస్‌ మహమ్మారిని తరిమికొడుదాం
  • జాతి ఐక్యతను చాటుదాం
  • విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా సమాచారం ఇవ్వాలి
  • జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను అరికట్టవచ్చు
  • జిల్లా కలెక్టర్‌ నిఖిల
  • నేడు రైళ్లు, ఆర్టీసీ బస్సులు బంద్‌..

‘కలిసికట్టుగా నిలుద్దాం.. మానవాళి మనుగడకు ప్రమాదకరంగా మారిన మహమ్మారి వైరస్‌ను తరిమికొడదాం.. స్వీయనిర్బంధం పాటించి జాతి ఐక్యతను నిలబెడదాం..’ అని ప్రజలంతా దీక్షబూనారు. జనం కోసమే జనతా కర్ఫ్యూ.. అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో సబ్బండవర్ణాలు కరోనాపై యుద్ధభేరి మోగించాయి. ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కర్ఫ్యూను స్వచ్ఛందంగా ఎవరికి వారుగా నిర్వహించేందుకు కంకణబద్ధులయ్యారు. రోజంతా ఇళ్లకే పరిమితం కావాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. 24 గంటలపాటు సకల వ్యవస్థలు బంద్‌ పాటించాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో రెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు కరోనా వైరస్‌పై ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో ప్రతిఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని, మాస్కులు ధరించాలని కలెక్టర్‌ నిఖిల కోరడంతో కరోనాను కట్టడి చేసేందుకు అన్నివర్గాలు నేడు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితకానున్నారు.

జనగామ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ను అడ్డుకోవడానికి ఆదివారం ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకుండా జనతా కర్ఫ్యూకు ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇదే స్ఫూర్తితో 24 గంటలు బయటకు రావొద్దని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపుతో 14 గంటల పాటు  స్వీయ నిర్బంధం ఉం టే.. మన రాష్ట్రంలో మాత్రం ఉదయం 6గంటల నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు బయటకు రాకుండా ఉండేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్‌పై పోరాడుతున్న దరిమిలా ఆ మేరకు అందరూ ఏర్పాట్లు చేసుకున్నారు. అభివృద్ధి చెందిన దేశాలను అతలాకుతలం చేస్తు న్న కరోనాను మన దేశం తీవ్రంగా ఎదుర్కొంటున్నది. ఎంత ఖర్చైన ఫర్వాలేదు ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని సీఎం కేసీఆర్‌ నిర్ణయాలు తీసుకున్నారు. దవాఖానల్లో ఐసోలేషన్‌ వార్డులతో పాటు, సిబ్బందికి కావాల్సిన రక్షణ చర్యలను తీసుకున్నారు. కృత్రిమ శ్వాసను అందించే 500 వెంటిలేటర్లను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలుకు సిద్ధమైంది.  ఇవి అవసరమైన జిల్లాలకు పంపించనున్నారు. మార్చి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 27వేల మంది వివిధ దేశాల నుంచి మన రాష్ర్టానికి వచ్చారు. వీరిలో ఇప్పటి వరకు 11వేల మంది వివరాల్ని ప్రభుత్వం తెలుసుకున్నది మిగితా వారి వివరాలు తెలియనున్నాయి. ప్రభుత్వ సిబ్బంది సమాచారం సేకరించకముందే విదేశాల నుంచి వచ్చిన దవాఖానలు, తహసీల్దార్‌ కార్యాలయంలో గానీ, పోలీస్‌స్టేషన్‌లో గానీ సమాచారం ఇవ్వాలని ముఖ్యమం త్రి కేసీఆర్‌ చేతులు జోడించి విజ్ఞప్తి చేయడం అందరినీ ఆలోచనలో పడేసింది. విదేశాల నుంచి వచ్చిన వారి ఆరోగ్యాన్ని వైద్యసిబ్బంది పరీక్షిస్తుందని, అనుకుంటే క్వారంటైన్‌కు పంపిస్తారని, ఎలాంటి కేసులు ఉండవని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జనగామ జిల్లాలో విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. వీరి వివరాలు సేకరించే పనిలో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు. పాలకుర్తి మండలానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల కెనడా నుంచి వచ్చాడు. అతడికి వైద్య పరీక్షలు చేయనున్నారు.

పరిశుభ్రతే ప్రాణాలు నిలబెడుతుంది..

ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత గురించి చదువుకున్నారు. వాటి ప్రాధాన్యత ఇప్పడు ప్రాక్టికల్‌గా తెలుసుకుంటున్నారు. ఒకప్పుడు మార్కెట్‌కు వెళ్లి ఇంటికి వచ్చాక కాళ్లు చేతులు కడుక్కున్నాకే ఇంట్లోకి రానిచ్చే వారు. ఇప్పుడు అదే పరిస్థితి పునారావృతం అవుతున్నది. కనిపించని వైరస్‌, బ్యాక్టీరియా, దుమ్ము దూళిని నివారించాలంటే శుభ్రత పాటించాలి. అప్పుడే ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవు.

జనతా కర్ఫ్యూనకు సహకరించాలి

  • జిల్లా ప్రజలకు కలెక్టర్‌ నిఖిల విజ్ఞప్తి

కలెక్టరేట్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూని ప్రజలు సహకరించాలని కలెక్టర్‌ నిఖిల విజ్ఞప్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని తెలిపారు. శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వైరస్‌ వ్యాపించకుండా మండల స్థాయిలో 12 సర్వేలెన్స్‌ బృందాలు, మన్సిపాలిటీల్లో 31, గ్రామస్థాయిలో 281 బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం వ్యాపార సంస్థలు మూసేయాలని, సమావేశాలు, కాన్ఫరెన్స్‌లు నిర్వహించరాదన్నారు. మార్చి 31 వరకు ఫంక్షన్‌హాల్స్‌ మూసివేయాలని, వివాహాలకు తక్కువ మందితో ముగించాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన 20 మందిని హోం ఐసోలేషన్‌లో ఉంచామని, వారి కుటుంబ సభ్యుల్ని హౌస్‌ క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కరోనా కేసు నమోదు కాలేదన్నారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. అధికారులు ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవా లో కలెక్టర్‌ వివరించారు. ప్రజలను చైతన్యపరిచి  ఇళ్లలో ఉండేలా చూడాలన్నారు. డీసీపీ శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు గుమిగూడి ఉండొ ద్దని జనతా కర్ఫ్యూలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని సూచించారు. పోలీసులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో శానిటైజేషన్‌ చేయాలని సూచించారు. డీసీపీ శ్రీనివాస్‌ రెడ్డి, ఆర్డీవో మధుమెహన్‌, డీఎంహెచ్‌వో మహేందర్‌ పాల్గొన్నారు.


logo