బుధవారం 01 ఏప్రిల్ 2020
Jangaon - Feb 27, 2020 , 03:15:19

చెత్తను వేరు చేసి ఇవ్వాలి

చెత్తను వేరు చేసి ఇవ్వాలి

జనగామ, నమస్తే తెలంగాణ : ‘తడి, పొడి చెత్తపై ప్రజల్లో కనీస అవగాహన లేదు.. నాలుగైదు రోజుల్లో ఇంటింటికీ రెండు బుట్టలు పంపిణీ చేసి, చెత్త సేకరణ పక్కాగా చేపట్టాలి.. మహిళలంతా తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చేలా చూడాలి’ అని కలెక్టర్‌ నిఖిలను రాష్ట్ర పురపాలక శాఖ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. జనగామ మున్సిపాలిటీ పరిధి 13, 30వ వార్డులోని దళిత వాడల్లో రాష్ట్ర పురపాలక శాఖ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ బుధవారం పర్యటించి పట్టణ ప్రగతిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కాలనీల్లో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జనగామ కలెక్టర్‌ కే నిఖిలతో కలిసి కాలినడకన తిరుగుతూ ప్రజలు, మహిళలతో ముఖాముఖిగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆసరా పింఛన్లు వస్తున్నాయా? సంక్షేమ పథకాలు అందుతున్నాయా? తాగునీరు, విద్యుత్‌ సరఫరా జరుగుతుందా? తడి, పొడి చెత్తబుట్టలు ఇచ్చారా? వాటిని మీరు వాడుతున్నారా? పారిశుద్ధ్య కార్మికులు మురుగు కాల్వలను శుభ్రం చేస్తున్నారా? అంటూ గృహిణులను మంత్రి కేసీఆర్‌ అడిగారు. చెత్తబుట్టలు మళ్లీ ఇస్తాం.. తడి, పొడి చెత్తను కార్మికులకు విడివిడిగా ఇవ్వండి.. మున్సిపల్‌ సిబ్బందికి కొత్తగా ఆటో రిక్షాలు, రిక్షాలు ఇస్తాం.. వాళ్లు వేర్వేరు డబ్బాల్లో పోయకుంటే ఇవ్వకండి అంటూ మహిళలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో చేపట్టిన తడి, పొడి చెత్త విధానంలో అక్కడి మహిళా సంఘాలు (ఆర్‌పీలు) నెలకు రూ.3 లక్షల ఆదాయం సమకూర్చుకుంటుంటే, ఇక్కడ మీరు జబ్బులు పోగు చేసుకుంటున్నారన్నారు. ఒకసారి సిద్దిపేట, గజ్వేల్‌, సిరిసిల్ల మున్సిపాలిటీలను సందర్శించి అక్కడి విధానాన్ని పరిశీలించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, కౌన్సిలర్లకు సూచించారు. శ్రమను గౌరవించే విధానం రావాలని.. ఇందుకోసం మున్సిపాలిటీల్లో పనిచేసే సఫాయి, మున్సిపల్‌ కార్మికుల పరిచయ కార్యక్రమం చేట్టామని చెప్పారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్లుగానే రోడ్డు, వీధి, పట్టణం సైతం మనదేననే భావనతో అందరూ కలిసికట్టుగా పట్టణాలను అభివృద్ధి చేసుకోవాలని కేటీఆర్‌ సూచించారు. ‘మనం మారుదాం.. మన పట్టణాన్ని మార్చుకుందాం’ అనే నినాదంతో ప్రతి వార్డులో శానిటేషన్‌ ప్లాన్‌, గ్రీన్‌ యాక్షన్‌ ప్లాన్‌, వాటర్‌ ఆడిట్‌ ప్లాన్లను రూపొందించాలని సూచించారు. మున్సిపల్‌ బడ్జెట్‌లో పది శాతం పచ్చదనం కోసం వెచ్చించాలని.. 85 శాతం మొక్కలు సంరక్షించకుంటే కౌన్సిలర్ల ఉద్యోగాలు పోతాయని కేటీఆర్‌ హెచ్చరించారు. ఇంటి నిర్మాణం కోసం ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పని లేదని స్పష్టం చేసిన మంత్రి.. కొత్త చట్టం పౌరుల పక్షాన ఉంటుందని.. అతిక్రమించిన వారికి శిక్షలు సైతం అంతే కఠినంగా ఉంటాయని చెప్పారు.


logo
>>>>>>