సోమవారం 08 మార్చి 2021
Jagityal - Dec 01, 2020 , 03:09:27

ధర్మపురిలో వైభవంగా దీపాలంకరణ

ధర్మపురిలో వైభవంగా దీపాలంకరణ

ధర్మపురి: ఆకాశాన మిలమిలలాడే చుక్కలన్నీ కోనేట్లో మణిదీపాలుగా వెలుగొందాయా.. అన్నట్లుగా మెట్టుమెట్టుకో దీపం.. అజ్ఞాన తిమిరాలు, కష్టాల చీకట్లను తరిమికొడుతూ అడుగుఅడుగుకో దీపం.. జ్వాలా తోరణమై  పంచసహస్ర దీపాలంకరణగా మారింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నవనారసింహక్షేత్రాల్లో ఒకటైన ధర్మపురి క్షేత్రంలోని బ్రహ్మపుష్కరిణి సోమవారం ఆధ్యాత్మిక కాంతులను విరజిమ్మంది. ఆలయ వేద పండితుడు బొజ్జ రమేశ్‌శర్మ తదితర వేదబ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ ఉప ప్రధాన అర్చకుడు నంబి శ్రీనివాసాచారి బ్రహ్మపుష్కరిణి మధ్య గల బోగమండపంలో లక్ష్మీనరసింహస్వామి చిత్రపటాన్ని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ దావ వసంత, కలెక్టర్‌ రవి, అడిషనల్‌ కలెక్టర్‌ రాజేశం, ఈవో శ్రీనివాస్‌ జ్యోతిప్రజ్వలన చేసి దీపాలంకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మహిళలు బ్రహ్మపుష్కరిణి చుట్టూ అప్పటికే సిద్ధంగా ఉంచిన దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా బ్రహ్మపుష్కరిణి దీపాలతో శోభిల్లింది. దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నేత్రపర్వంగా గోదావరి హారతి

ధర్మపురి క్షేత్రంలో 15రోజులుగా గోదావరి హారతిని నిర్వహిస్తున్నారు. శుక్లపక్షం చివరిరోజైన సోమవారం కార్యక్రమాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా దేవాలయ పక్షాన దేవస్థానం నుంచి సాయంత్రం వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల మధ్య మంగళవాయిద్యాలు వెంటరాగా అర్చకులు, సిబ్బంది, భక్తులు గోదావరి నది వద్దకు శోభాయాత్రగా వెళ్లారు. నది ఒడ్డున వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయ రీతిలో అర్చకులు గోదావరి మాతకు ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం నదీ మాతకు హారతి కార్యక్రమాన్ని పండితులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో  జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ దావ వసంత, కలెక్టర్‌ రవి, అడిషనల్‌ కలెక్టర్‌ రాజేశం, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సంగి సత్తెమ్మ, దేవస్థానం ఈవో సంకటాల శ్రీనివాస్‌, వేదపండితులు బొజ్జ రమేశ్‌శర్మ, ముత్యాల శర్మ, సూపరింటెండెంట్‌ ద్యావళ్ల కిరణ్‌కుమార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ అలువాల శ్రీనివాస్‌, అర్చకులు బొజ్జ సంతోష్‌కుమార్‌, బొజ్జ రాజగోపాల్‌, ఉప ప్రధాన అర్చకుడు శ్రీనివాసాచార్యులు, జూనియర్‌ అసిస్టెంట్‌ దేవయ్య తదితరులున్నారు.

VIDEOS

తాజావార్తలు


logo