మంగళవారం 11 ఆగస్టు 2020
Jagityal - Jul 06, 2020 , 01:08:31

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

జగిత్యాల రూరల్‌ : మన ఇంటిని, పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని జగిత్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ బోగ శ్రావణి పేర్కొన్నారు. రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు పది నిమషాలు మన కోసం మనం’ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్‌ అధ్యక్షురాలు బోగ శ్రావణి తన నివాసంలో పరిసరాలను శుభ్రం చేశారు. మొక్కల మధ్య ఉన్న చెత్తను తీసేసి పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని, ఇంటిలో కిచెన్‌ సింక్‌ను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మలేరియా, డెంగీ వంటి సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ఇంటి పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉచుకోవాలన్నారు. నీటిని నిల్వ ఉంచకుండా చూసుకోవాలన్నారు. నిల్వ ఉండే నీటిలో దోమలు గుడ్లు పెట్టి వ్యాప్తి చెందే అవకాశం ఉన్నదన్నారు. 

కోరుట్ల టౌన్‌: సీజనల్‌ వ్యాధులు దరిచేరకుండా ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ ఆయాజ్‌ పేర్కొన్నారు.  ప్రతి ఆదివారం పది గంటలు, పది నిమిషాలు కార్యక్రమంలో భాగంగా మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో పూలకుండీలు, కూలర్‌ తొట్టిలో నిల్వ ఉన్న నీరును ఆధికారులతో కలిసి పారబోసి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ కొబ్బరి బొండాలు, టైర్లు, పాడైపోయిన వస్తువులు, ప్టాస్టిక్‌కవర్లలో నిల్వ ఉన్న నీటిని తొలగించాలని సూచించారు. ఇక్కడ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ గజానంద్‌, మున్సిపల్‌ పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు. logo