బుధవారం 01 ఏప్రిల్ 2020
Jagityal - Jan 17, 2020 , 01:02:48

కులమతాలకు అతీతంగా సర్కారు పథకాలు

కులమతాలకు అతీతంగా సర్కారు పథకాలు
  • -అర్హులందరికీ దరిచేరేలా చర్యలు
  • -అభివృద్ధి చేశాం.. ఆదరించండి
  • -టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తేనే మరింత ప్రగతి
  • -ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు
  • -కోరుట్ల, మెట్‌పల్లిలో ఎన్నికల ప్రచారం

కోరుట్లటౌన్‌: తెలంగాణ ప్రభుత్వం కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. పట్టణంలోని 9, 10, 15, 30 వార్డుల్లో గురువారం ఆయన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఫలాలు పేద ప్రజలకు అందాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆశయమని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులకు పెంచిన పింఛన్లు అందిస్తూ ఆర్థిక భరోసాను కల్పిస్తుందన్నారు. పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సాయమందించేందుకు కల్యాణలక్ష్మి, షాదీముభారక్‌ పథకాలను అమలు చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అత్యధికంగా కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు లబ్ధి చేకూర్చామని గుర్తు చేశారు. మిషన్‌ భగీరథ పనులు పూర్తి కావచ్చాయని, మార్చి చివరినాటికి శుద్ధ జలాలను నల్లాల ద్వారా ఇంటింటికి అందించనున్నట్లు తెలిపారు. పట్టణంలోని పెద్ద గుండు సమీపంలో 350 ఇళ్లు నిర్మిస్తున్నామని, అర్హులైన ప్రతి కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కేటాయిస్తామన్నారు. ఏప్రిల్‌లో పీఎఫ్‌ కలిగిన బీడీ కార్మికులందరికీ పింఛన్‌ అందించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌లో 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్‌ అందిస్తామని పేర్కొన్నారు. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ప్రతిపక్షాల కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. కోరుట్ల పట్టణాభివృద్ధి కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.50కోట్ల నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. పార్టీలకు అతీతంగా 33వార్డులకు అభివృద్ధి నిధులు కేటాయించి మురుగుకాల్వలు, అంతర్గత రహదారులు నిర్మించామన్నారు. అనంతరం ఆయా వార్డుల్లో పోటీలో ఉన్న గడ్డమీది పవన్‌, పుప్పాల ఉమారాణి, సజ్జూ, మోసీన్‌లను గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్‌, ఎంపీపీ తోట నారాయణ, నాయకులు జిల్లా ధనుంజయ్‌, మోహసీన్‌, ముబీన్‌పాషా, ప్రభు తదితరులున్నారు.

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా లావణ్య

టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్‌ సతీమణి లావణ్యను టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ప్రకటించారు. పట్టణంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో గురువారం తెలంగాణ పెన్షనర్లు, సీనియర్‌ సిటిజన్‌ డైరీ, క్యాలెండర్‌ను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలువాలని కోరారు. టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్‌, నాయకులు పబ్బ శివానందం, సైఫొద్దీన్‌, గుడ్ల గంగాధర్‌, రాజమోహన్‌, లక్ష్మీనారాయణ, లక్ష్మీకాంతం తదితరులున్నారు.

ఐదేండ్లలో ఎంతో అభివృద్ధి చేశాం

మెట్‌పల్లిటౌన్‌: గడిచిన ఐదేండ్లలో ఎంతో అభివృద్ధి చేశాం.. మరోసారి ఆదరించి మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. గురువారం పట్టణంలోని 14, 23 వార్డులలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మాన్కల గంగాధర్‌, ఒజ్జెల బుచ్చిరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డుల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు.  అధికార పార్టీ అభ్యర్థులను కౌన్సిలర్లుగా గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు త్వరలోనే డబుల్‌ బెడ్‌రూంఇండ్లను పంపిణీ చేయనున్నామని, పట్టణ శివారులోని అర్బన్‌ హౌసింగ్‌ కాలనీలో 350 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం పూర్తి దశలో ఉన్నాయన్నారు. ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు మిషన్‌ భగీరథ పనులు  చకచకా జరుగుతున్నాయన్నారు.  పట్టణ సమగ్రాభివృద్ధికి కోసం ఐదేండ్లలో కోట్లాది రూపాయలను మంజూరు చేయించామని, పట్టణ సుందరీకరణ, మౌలిక వసతుల కల్పన కోసం రూ.50 కోట్ల వ్యయంతో పనులు కొనసాగుతున్నాయన్నారు. కళ్ల ముందే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని,  నిరంతరం అభివృద్ధి, ప్రజా సంక్షేమం  కోసం పాటుపడే టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు.  14వ వార్డులో కూబ్‌సింగ్‌ కుంటను చిల్డ్రన్‌ పార్క్‌గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. డ్రైనేజీ, అంతర్గత రహదారులు, స్ట్రీట్‌ లైట్లు తదితర మౌలిక వసతులను అన్ని వార్డుల్లో  కల్పించినట్లు చెప్పారు.  ఆయా  వార్డుల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు రానవేణి సత్యనారాయణ,  మాడిశెట్టి ప్రభాకర్‌, రాజ్‌మహ్మద్‌, బాల్క సురేశ్‌, గాజ చిన్న రాజన్న, అలీం, ఒజ్జెల శ్రీనివాస్‌, ఆకుల ప్రవీణ్‌, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌లోకి బీజేపీ శ్రేణుల చేరిక

పట్టణంలోని 19, 21వ వార్డులకు చెందిన  పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు  గురువారం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరిలో 21వ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్‌ మార్గం లావణ్య, గణేశ్‌ దంపతులు, 19వ వార్డు  బీజేపీ ఇన్‌చార్జి ఏశవేణి గణేశ్‌తో పాటు సుమారు 100 మంది కార్యకర్తలున్నారు.  గులాబీ కండువాలు కప్పి వీరిని ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్‌ఎస్‌ నాయకులు షేక్‌ మహ్మద్‌, పిప్పెర శేఖర్‌, బీమనాతి సత్యనారాయణ, ఒజ్జెల శ్రీనివాస్‌, నోముల లక్ష్మారెడ్డి, సుగుణాకర్‌రావు, జగన్‌, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 



logo
>>>>>>