బుధవారం పొద్దున్నే.. మత్తు కండ్లు నలుసుకుంటా టీవీ దిక్కు చూస్తే ‘ఆపరేషన్ సిందూర్’ అని ఇంగ్లిష్ టైటిల్ గంభీరంగా కనిపించింది. రెండు ‘ఓ’ అక్షరాల్లో ఒక దానిలో కుంకుమ భరిణ.. మరో ‘ఓ’లో ఒలికిపడిన కుంకుమతో భావోద్వేగాలను రంగరించారు. దీనికి టీవీ చానల్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో జెట్ ఫైటర్స్, యుద్ధ ట్యాంకులను వదిలాయి. పహల్గాంలో ఆడబిడ్డల నుదుటిన చెదిరిన సిందూరానికి భారత మార్క్ గుణపాఠమని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. పహల్గాంలో ఓ నేపాలీ, 25 మంది భారతీయులను బలిగొన్న ఉగ్రవాద దారుణంపై పెల్లుబికిన భావోద్వేగాలకు తగినట్టు అజిత్ దోవల్ సలహాతో ప్రధాని మోదీ డిజైన్ చేసిన యుద్ధ వ్యూహం ఇది.
పాకిస్థాన్ జనావాసాల మధ్యన ఉన్న ఉగ్ర అడ్డాల మీద మన వైమానిక సైన్యం ఇంచుక కూడా గురిచెదరకుండా బాంబులు వేసిందని చానల్స్ బ్రేకింగ్ వేస్తున్నయి. చూస్తుండగానే భారత సైన్యం ప్రతినిధులు మీడియా ముందుకు వచ్చారు. విదేశాంగ కార్మదర్శి, కశ్మీరీ బ్రాహ్మణ దౌత్యాధికారి విక్రమ్ మిస్రీ మధ్యలో కూర్చోగా ఆయనకు కుడి వైపు ఆర్మీ ప్రతినిధి, మహిళ కల్నల్ సోఫియా ఖురేషి.. ఎడమ వైపు వైమానిక దళ ప్రతినిధి, వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ కూర్చున్నారు. రాత్రి జరిగిన సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించిన విషయాలను వివరిస్తుంటే.. ఎక్కడ పోగొట్టుకున్నామో..! అక్కడే వెతుక్కుంటునట్టు అనిపించింది.
ఫోన్ తీసి సోషల్ మీడియాలో చూశాను.. వాట్సాప్ నిండా ఆపరేషన్ సిందూర్ ముచ్చట్లే. ఎవరికి తగ్గ విశ్లేషణలు వారు రాస్తున్నరు. యుద్ధం ఏ రూపంలో జరిగినా దుఃఖమేనని కొందరంటున్నరు. యుద్ధం జరగాల్సిందేనని ఇంకొందరు వాదిస్తున్నరు. యుద్ధం వద్దన్న వారిని దేశద్రోహుల కింద జమ కడుతూ ఓ వర్గం పోస్టులు పెడుతున్నరు. వీటన్నింటినీ డామినేట్ చేస్తూ వాట్సాప్ గ్రాడ్యుయేట్లు కొందరు ‘మోదీ ది గ్రేట్’ లాంటి వచనాలను మిసైల్స్ కంటే వేగంగా అక్షరాయుధాలు సంధిస్తున్నరు. తప్పు లేదు.. దేశ ప్రధాని.. సాహసోపేత నిర్ణయం.. దశాబ్దాల నాటి పాక్ సీమాంతర ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్న సమయం. ఆ మాత్రం నైతిక మద్దతు అవసరమే.
ఇదే వాట్సాప్‌లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆరేండ్ల కిందట అసెంబ్లీలో చేసిన ప్రసంగం క్లిప్పింగ్ ఒకటి వైరల్ అవుతున్న ది. ఓపెన్ చేసి చూస్తే.. ‘కశ్మీర్ దగ్గర పాకిస్థాన్ గింతంత దేశం అధ్యక్షా… తీసి గట్టిగ కొడితే పోత డు. మనమెక్కడ.. మన సంఖ్యెక్కడ.. వాళ్లెక్కడ? పొద్దున ధోతి పట్టుకొని గుంజుడు.. సాయంత్రం కమీజ్ గుంజుడు.. బార్డర్ మీద సైనికులను సంపుడు.. రోజో న్యూసెన్స్ వాల్యూ.
కశ్మీర్‌ను అడ్డం పెట్టుకొని మాదంటే.. మీదంటే..! ఎప్పుడో అప్పుడు పంచాయితీ తెగాలే. అది దేశ సమస్య. ఎస్.. వియ్ షుడ్ సపోర్ట్ దిస్. మా పాలసీ మాది’.. ఈ గిల్లీ కజ్జాలు పెట్టుకునుడు ఆపి, యుద్ధం చేసి శాశ్వత, స్థిర పరిష్కారం చూ పండి అన్నట్టు ఆ వీడియోలో కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. మూడొద్దుల దిన పొద్దు గడిచిం దో.. లేదో భారత్-పాకిస్థాన్ వైరం నాడు కేసీఆర్ చెప్పిన కాడికే వచ్చింది. ఆపరేషన్ సిందూర్‌లో అర్ధంతరంగా అస్త్ర సన్యాసం ప్రకటన వచ్చింది.
యుద్ధాన్ని భారతీయులేమి కోరుకోలేదు.. యుద్ధం చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి చేయలేదు. అమానవీయమైన యుద్ధ కుతూహలం భారతీయ స్వభావంలోనే లేదు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చంపితే చావటం.. వదిలేస్తే బతకటం దేశ ప్రజలకు కొత్త కాదు.
ఎన్నోసార్లు ఉగ్రదాడులు జరిగినప్పుడు, అమాయక ప్రజలను చంపినప్పుడూ భారత ప్రజలు బాధపడ్డారే తప్ప, యుద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయలేదు. తాజాగా పహల్గాం దారుణం జరిగినప్పుడు కూ డా ప్రజలు బాధపడ్డారు కానీ, యుద్ధం చేయాలని అడగలేదు. కేంద్రం సీరియస్‌గా తీసుకున్నది. ప్రతీకారంగా రాత్రికిరాత్రే సర్జికల్ దాడు లు చేసింది. పాక్, పీవోకేలోని 9 స్థావరాలపై మన వైమానిక దళం విరుచుకుపడ్డది.. టెర్రరిస్టులను మట్టుబెట్టింది. మన సైన్యం యుద్ధ వి న్యాసానికి ప్రపంచమే అబ్బురపడ్డది.. ఆశ్చర్య పోయింది. శభాష్.. అని ఆమోదం తెలిపింది.
2016 ఉరిలో 17 మందిని దారుణంగా చంపిన నేపథ్యంలోనూ, 2019లో పుల్వామాలో 40 మంది జవాన్లను చంపిన సందర్భంలోనూ కేంద్రం సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. కానీ, ఆ దాడి పాక్ పీవోకే వరకే పరిమితమైంది. ఇప్పుడు నేరుగా పాకిస్థాన్‌లోని భూభాగంలోకి ప్రవేశించి దాడులు చేసింది. అక్కడి ఉగ్రవాద కేంద్రాల మీద మిసైల్స్ వేసింది. 80 మందికి పైగా ఉగ్రమూకను హతమార్చింది. భౌగోళిక నియంత్రణ రేఖ దాటి ఆ దేశం మీదికి దండయాత్ర చేశామంటే.. యుద్ధం చేయటానికే అనే సంకేతాలు పంపినట్టే కదా..!
ఒక్కసారిగా పరిస్థితులు గంభీరంగా మారిపోయాయి. పాకిస్థాన్ మనల్ని కవ్విస్తూ పేలుడు పదార్థాలు నింపిన వందల డ్రోన్లను ఏకధాటిగా వదిలింది. మన సైన్యం ఎస్-400 సుదర్శన చక్రాన్ని నలుదిక్కులకు తిప్పి ఆ డ్రోన్లను తిప్పికొట్టింది. ఇదంతా గమనించే ‘తాడోపేడో ఏదో ఒకటి తేలిపోనీ..! ఎంతకాలం ఈ నటన’ అన్నట్టు ప్రజలు మానసికంగా సంసిద్ధులయ్యారు. యుద్ధ సమయంలో ఎలా మెలగాలో తమను తాము మలుచుకున్నారు. యుద్ధ బీభత్సాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు. సరిహద్దుల్లో భారత త్రివిధ దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నయి. శనివారం ఉదయం పాక్ సరిహద్దు నుంచి ఆ దేశ సైన్యం పీవోకే వైపు కదిలినట్టు సమాచారం అందింది.. మన వైపు భారత సైన్యం కూడా హైఅలర్టుతోనే కాచుకొని ఉన్నది.. భారత నుదుటిన విజయ సిందూరం దిద్దటానికి సర్వసన్నద్ధమై ఉన్నది. యుద్ధం తథ్యం అన్నట్టు వాతావరణం వేడెక్కింది.
యుద్ధం తప్పదనే సంకేతాలు వెలువడ్డయి. ఒక రకంగా ప్రభుత్వమే ఇటువంటి సంకేతాలు ఇచ్చింది. సైన్యం నుంచి రిటైర్ అయిన లాన్స్ నాయకుల నుంచి కర్నల్స్, లెఫ్టినెంట్ కర్నల్స్ వరకు తల్లి భరతమాత ఉగ్ర శృంఖలాలు తెంచే క్రతువులో తాము భాగస్వాములం కాలేకపోతున్నామని బాధపడ్డరు. కొందరైతే తమకు ఆర్మీ చీఫ్ ఆఫీస్ నుంచి పిలుపు వస్తుందని వెయ్యి కండ్లతో ఎదురుచూశారు. దేశమంతటా అలుముకున్న ఓ ఉద్వేగపు అలజడి భారతీయులను ఏకతాటి మీద నిలబెట్టింది.
పాక్ ఆక్రమిత భూభాగం మన దేశం భౌగోళిక స్వరూపంలో మిళితం కావాలనే ఆకాంక్ష ప్రజల్లో ప్రబలమైంది. మన సైన్యం తెగించింది. సాంకేతిక యుద్ధ విన్యాసాలతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. కాల్బలం ఇంకా కదలకుండానే గెలుపు వాకిట నిలబడ్డది. కానీ, సగటు భారతీయుని ఊహకు కూడా అందని విధంగా.. కాల్పుల విరమణకు భారత్-పాక్ దేశాలు అంగీకరించాయి. ఈ ఒప్పందం వెంటనే అమల్లోకి వస్తుందని మే 10న శనివారం సాయంత్రం సరిగ్గా 5.30 గంటలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ట్విటర్ ఖాతా నుంచి ట్వీట్ చేశారు. తాము జరిపిన 48 గంటల మధ్యవర్తిత్వంతో ఇది సాధ్యమైందని చెప్పుకొచ్చారు. ట్రంప్ పోస్టు పెట్టిన అర్ధ గంటలో కోటి మంది దాన్ని చూశారు. 10 కోట్ల మందికి సమాచారం చేరింది. ఆ తర్వాత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియా ముందుకొచ్చారు. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ నిజమేనని ధ్రువీకరించారు. భారత్-పాక్ నడుమ ఏ గొడవలు వచ్చినా ఇద్దరమే మాట్లాడుకుంటమనేది భారత స్థిర నినాదం. ఇది ఇప్పటి మాట కాదు.. 1972 సిమ్లా ఒప్పందం నాటి మాట. 1999 లాహోర్ డిక్లరేషన్‌లోనూ ఈ మాటకే కట్టుబడి ఉన్నం. మనం యుద్ధ సన్నాహాల్లో ఉన్నప్పుడు ‘సీజ్ ఫైర్’ అని ట్రంప్ ప్రకటించడమేమిటి? ‘అవునవును’ అని మనం తల ఊపడం ఏమిటి? ట్రంప్ మధ్యవర్తిత్వానికి తలవంచామా? అణ్వాయుధాల బ్లాక్‌మెయిల్‌కు భయపడ్డామా? ప్రధాని ప్రసంగంలో సమాధానం దొరుకుతుందని ఆశించాం. కానీ, ఆయన ట్రంప్ దొర పేరు ఎత్తకుండా జాగ్రత్తపడ్డారు.
హఠాత్తుగా రెండు, మూడు రోజుల్లోనే కాల్పుల విరమణ ఎందుకు ప్రకటించినట్టు? అతి సునాయాసంగా గెలుపు అంచుల దాకా వెళ్లిన భారతీయ సైన్యాన్ని అస్త్ర సన్యాసం చేయాలని ఆదేశించిన జగన్నాటక సూత్రధారి ఎవరు? అమాయకపు ఆడబిడ్డల నుదుటి సిందూరాలను చెరిపిన పహల్గాం టెర్రరిస్టులను మట్టుబెట్టారా? కనీసం వారు పట్టుబడ్డారా? పోనీ.. పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చిందా? 26 మంది ఆడబిడ్డల ఐదో తనాన్ని తుడిచిన ఆ.. ముష్కరులను ప్రాణాలతో అప్పగిస్తామని పాక్ హామీ ఏమైనా ఇచ్చిందా? పీవోకే నుంచి వైదొలిగి భారత్‌కు ఇచ్చేస్తామని ప్రతిపాదించిందా? పాక్‌లో వెళ్లూనుకున్న ఉగ్ర తండాలను సమూలంగా పీకివేశామా? ప్రాణానికి ప్రాణమే లక్ష్యంగా మనం ప్రతిదాడికి దిగామా? ఏ ప్రశ్నకు సమాధానం లేకండా.. ఏ గమ్యం చేరకుండానే అస్త్ర సన్యాసం చేయించటం వెనుక ఆంతర్యం ఏమిటి? అనేవి బేతాళ ప్రశ్నలే.
– వర్ధెల్లి వెంకటేశ్వర్లు