కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఫేస్బుక్లో వీడియో సందేశం ఇచ్చారు. ఆక్రమణకు దిగిన రష్యా భీకర పరిస్థితుల్ని క్రియేట్ చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. దళాలను ఉపసంహరిస్తున్న సమయంలో వందలు, వేల సంఖ్యలో రష్యా ప్రమాదకరమైన మైన్లను వదిలి వెళ్లినట్లు జెలెన్స్కీ తెలిపారు. ప్రతి చోటా ల్యాండ్మైన్లు ఉన్నాయని, సీజ్ చేసిన ఇండ్లలో, వీధుల్లో, పొలాల్లో, ప్రజల ప్రాపర్టీల్లో, కార్లలో అన్ని చోట్లా మైన్ బాంబులను నాటినట్లు ఆయన చెప్పారు. ఉక్రెయిన్లో రసాయనిక దాడికి కూడా రష్యా ప్లాన్ వేసినట్లు జెలెన్స్కీ వెల్లడించారు. అయితే పటిష్టమైన రక్షణ చర్యలను చేపట్టాలని ఉక్రెయిన్ ప్రజల్ని ఆయన కోరారు. రష్యా దళాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని, రోజంతా ఈ అంశాన్ని రివ్యూ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
రష్యా దళాల కన్నా.. ఉక్రెయిన్ బలగాలు ధైర్యంగా ఉన్నాయన్నారు. కానీ తమ దేశం ఆయుధాల కోసం విదేశీ భాగస్వాములపై ఆధారపడి ఉన్నట్లు తెలిపారు. మారియపోల్ నగరాన్ని చేధించే అస్త్రాలు తమ వద్ద లేవన్నారు. మారియపోల్ నగరంలో కెమికల్ దాడి జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాన్ని పరిశీలించనున్నట్లు యూకే చెప్పింది. మారియపోల్లో సుమారు పది వేల మంది పౌరులు మరణించి ఉంటారని, ఇంకా అక్కడ లక్షన్నర మంది ఉన్నారని ఆ నగర మేయర్ తెలిపారు.