Zelensky : అమెరికా అధ్యక్ష భవనంలోని ఓవల్ ఆఫీస్‌లో అమెరికా అధ్యక్షుడు (America president) డొనాల్డ్ ట్రంప్ (Donald trump) – ఉక్రెయిన్ అధ్యక్షుడు (Ukraine president) జలెన్‌స్కీ (Zelensky) మధ్య వాగ్వాదం జరగడానికి ముందు అమెరికాకు చెందిన ఓ రిపోర్టర్ కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడితో వాగ్వాదానికి దిగాడు. ట్రంప్‌తో సమావేశంలో జలెన్ స్కీ అసహనానికి అది కూడా ఒక కారణమని చెప్పవచ్చు.
వ్లాదిమిర్ జలెన్‌స్కీ వైట్‌హౌస్‌లో అడుగుపెట్టగానే అమెరికాకు చెందిన ఓ రిపోర్టర్ ఆయనను ‘సూట్ ఎందుకు ధరించలేదు..? మీకు సూట్ లేదా..?’ అని ప్రశ్నించాడు. దాంతో ‘నీకేమైనా సమస్యా..?’ అని జలెన్‌స్కీ ఆ రిపోర్టర్ తిరుగు ప్రశ్న వేశాడు. అందుకు ‘ఓవల్ ఆఫీస్ డ్రెస్ కోడ్‌ను పాటించకపోతే అమెరికాలోని చాలా మంది పౌరులకు సమస్య’ అని రిపోర్టర్ బదులిచ్చాడు. దాంతో రష్యా యుద్ధం ముగిసిన తర్వాతే తాను సూట్ ధరిస్తానని జలెన్‌స్కీ చెప్పాడు.
‘రష్యాత యుద్ధం ముగిసిన తర్వాత నేను సూట్ ధరిస్తా. అది మీ సూట్ లాంటింది కావచ్చు. అంతకంటే మంచిది కావచ్చు. చెప్పలేం అంతకంటే చవకైనది కూడా కావచ్చు’ జలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ట్రంప్ కలుగజేసుకుని జలెన్ స్కీ డ్రెస్సింగ్ స్టైల్ నాకు ఇష్టమని వ్యాఖ్యానించారు. జలెన్‌స్కీ 2022లో రష్యాతో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఏ దేశాధినేతతో సమావేశమైనా అదే నలుపు దుస్తుల్లో వెళ్తున్నారు. ఆఖరికి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించినప్పుడు ఆ దుస్తుల్లోనే ఉన్నారు.
అయితే రిపోర్టర్‌తో వివాదం అనంతరం ట్రంప్‌తో జలెన్‌స్కీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో అమెరికా ఉపాధ్యక్షుడు, ఇరు దేశాల దౌత్యవేత్తలు, అమెరికా సహా అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు, రెండు దేశాలకు చెందిన ఉన్నతాధికారులు ఉన్నారు. సమావేశం మొదలవగానే ఇరు దేశాల అధినేతలిద్దరూ ఒకరినొకరు పలుకరించుకున్నారు. ప్రశంసించుకున్నారు. ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే వారి మధ్య వివాదం మొదలైంది.