Xi Jinping | తైవాన్‌కు, చైనాకు మధ్య చెడిందా.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. పశ్చిమ దేశాల మద్దతుతో డ్రాగన్‌తో ఢీ అంటే ఢీ అంటున్నది తైవాన్. ఈ వారంలో యుద్ధానికి సిద్ధం కావాలంటూ చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ అన్నారని డ్రాగన్ జాతీయ మీడియా వార్తా కథనాలు ప్రచురించింది. తైవాన్ చుట్టూ చైనా భారీ స్థాయిలో సైనిక విన్యాసాలు నిర్వహించిన తర్వాత జీ జిన్ పింగ్ ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రాధాన్యం ఏర్పడింది. ఈ వారం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ బ్రిగేడ్‌ను సందర్శించినప్పుడు జీ జిన్ పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘సైన్యానికి యుద్ధ సామర్థ్యం కలిగించేలా యుద్ధానికి సిద్ధంగా ఉండేందుకు మిలిటరీ శిక్షణ సమగ్రంగా బలోపేతం చేసుకోవాలి’ అని జీ జిన్ పింగ్ అన్నట్లు ప్రభుత్వ అధికార టీవీ చానెల్ వార్త ప్రసారం చేసింది. సైనికులు తప్పనిసరిగా తమ యుద్ధ నైపుణ్యాన్ని, వ్యూహాలను పెంచుకోవాలని ఆయన చెప్పారు. కొంత కాలంగా తైవాన్ తమ భూభాగంలో భాగమేనని చైనా వాదిస్తోంది. గత సోమవారం తైవాన్ నలు దిక్కులా యుద్ద విమానాలు, డ్రోన్లు, యుద్ధ నౌకలు, కోస్ట్ గార్డు నౌకలను మోహరించింది.
గత రెండేండ్లలో భారీస్థాయిలో తైవాన్ చుట్టూ సరిహద్దుల్లో చైనా సైనిక విన్యాసాలు నిర్వహించడం నాలుగో సారి. తైవాన్ను స్వాధీనం చేసుకునేందుకు బల ప్రయోగం చేసేందుకు వెనుకాడబోమని చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ నేతలు చెబుతున్నారు. దేశ వ్యూహాత్మక, కీల ప్రయోజనాల పరిరక్షణకు మిలిటరీ తప్పనిసరిగా సమర్థవంతంగా పని చేయాలని జీ జిన్ పింగ్ అన్నట్లు అధికార టీవీ పేర్కొంది. 1949 నుంచి చైనా, తైవాన్ మధ్య వివాదం కొనసాగుతున్నది.