హాంగ్‌కాంగ్ సిటీ: హాంగ్‌కాంగ్(Hong Kong)లో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబును గుర్తించారు. ఆ బాంబు సుమారు 450 కేజీల బరువు ఉన్నది. క్వారీ బేలో నిర్మాణ కార్మికులకు ఆ బాంబు దొరికింది. అయితే దాన్ని నిర్వీర్యం చేసేందుకు వేల మందిని అక్కడి నుంచి తరలించారు. రెండో ప్రపంచ యుద్ధానికి చెందిన ఆ బాంబును అమెరికా తయారు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఆ బాంబు సుమారు 1.5 మీటర్ల ఎత్తు ఉంటుంది. దాదాపు వెయ్యి పౌండ్ల బరువు అంటే సుమారు 450 కేజీల బరువు ఉందన్నమాట. అది రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి బాంబు అని నిర్ధారణ జరిగినట్లు పోలీసు ఆఫీసర్ ఆండీ చాన్ టిన్ చూ తెలిపారు. బాంబును నిర్వీర్యం చేయడంలో హై రిస్క్ ఉన్నందున వేల మందిని మరో ప్రాంతానికి తరలించినట్లు ఆయన చెప్పారు.
సుమారు 1900 ఇండ్ల నుంచి ఆరు వేల మందిని తరలించారు. శుక్రవారం రాత్రి బాంబు డియాక్టివేషన్ మొదలైంది. శనివారం ఉదయం 11.30 నిమిషాల వరకు కొనసాగింది. ఈ ఆపరేషన్‌లో ఎవరూ గాయపడలేదు. హాంగ్‌కాంగ్‌లో రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి బాంబులు తరుచూ బయటపడుతూనే ఉన్నాయి.
సెకండ్ వరల్డ్ వార్ సమయంలో హాంగ్ కాంగ్ సిటీని జపనీస్ దళాలు ఆక్రమించాయి. జపనీస్ మిలిటరీ, షిప్పింగ్ కోసం బేస్‌గా వాడుకున్నారు. జపనీస్ సైన్యాన్ని దెబ్బతీయాలన్న ఉద్దేశంతో అమెరికా, వాటి మిత్రదేశాలు హాంగ్‌కాంగ్‌పై బాంబులు జార విడిచాయి.