Trump – Zelensky : అమెరికా అధ్యక్ష భవనంలోని ఓవల్ ఆఫీస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ – ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన వాగ్వాదంపై ప్రతిపక్ష డెమోక్రాట్లు సహా ప్రపంచ దేశాలు స్పందించాయి. అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌లు రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పినట్లు నడుస్తున్నారని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. జెలెన్స్కీ ఒంటరి కాదని, తాము ఉక్రెయిన్‌తో కలిసి శాంతి కోసం పని చేస్తామని ఐరోపా సమాఖ్య చీఫ్ ఉర్సులా వాన్ డర్ లెయెన్ అన్నారు. ఇదిలావుంటే జెలెన్స్కీకి ఇలా జరగాల్సిందేనని రష్యా ఎద్దేవా చేసింది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో రష్యానే దురాక్రమణదారని అమెరికా మిత్రదేశమైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వ్యాఖ్యానించారు. పుతినే మూడో ప్రపంచ యుద్ధంతో ఆటలాడుతున్నారని విమర్శించారు. యుద్ధంలో ఎవరు బాధితులో, ఎవరు దురాక్రమణదారో తమకు తెలుసని, ఉక్రెయిన్‌కు మద్దతు కొనసాగిస్తామని జర్మనీకి కాబోయే ఛాన్సెలర్ ఫ్రెడరిక్ మెర్జ్ తెలిపారు. యుద్ధాన్ని ముగించేందుకు ఇక ఆలస్యం చేయకుండా సమావేశమవ్వాలని ఐరోపా, అమెరికా దేశాలకు ఇటలీ ప్రధాని మెలోనీ సూచించారు.
నెదర్లాండ్స్, పోలాండ్, స్పెయిన్, బ్రిటన్, స్వీడన్ దేశాలు ఉక్రెయిన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టంచేశాయి. ఉక్రెయిన్ తమ స్వాతంత్య్రం కోసమే కాకుండా అందరి కోసం పోరాడుతోందని కెనడా తెలిపింది. కీవ్‌కు మద్దతుగా ఉండటం గర్వకారణమని డెన్మార్క్ ప్రకటించింది. హంగేరీ మాత్రం భిన్నంగా అమెరికాను సమర్థించింది. శాంతి కోసం ట్రంప్ ధైర్యంగా నిలబడ్డారని, మూర్ఖులే యుద్ధాన్ని కోరుకుంటారని హంగేరీ ప్రధాని అన్నారు. కాగా, తమకు మద్దతు తెలిపిన వారందరికీ ఉక్రెయిన్ అధ్యక్షుడు పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు.
ట్రంప్, జెలెన్స్కీ మధ్య జరిగిన వాగ్వాదంపై రష్యా సైతం స్పందించింది. జెలెన్స్కీకి ఇలా జరగాల్సిందేనని పేర్కొంది. అమెరికా పట్ల అమర్యాదగా ఉన్న ఉక్రెయిన్‌కు ఈ పరిణామం గట్టి చెంపదెబ్బని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు తమకు అన్నం పెట్టిన చేతినే గాయపరుస్తున్నారని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా ఆరోపించారు. జెలెన్స్కీ తమకు సాయం చేసిన వారితోనే వాగ్వాదానికి దిగారని, ఆయనపై దాడి చేయకుండా ట్రంప్, జేడీ వాన్స్ సంయమనం పాటించడం అద్భుతమని వ్యాఖ్యానించారు.
మరోవైపు డొనాల్డ్ ట్రంప్, జెలెన్స్కీ మధ్య శాంతి చర్చలు కాస్తా రసాభాసగా మారడంవల్ల ఉక్రెయిన్ రాయబారి ఒక్సానా మార్కరోవా కాస్త ఆందోళనకు గురయ్యారు. అయ్యో ఇలా జరుగుతుందేంటీ..? అన్నట్లుగా తల పట్టుకున్నారు. ఆమె హావభావాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రంప్, జెలెన్ స్కీ మీడియా ఎదుటే వాగ్వాదానికి దిగారు. రష్యా చేస్తున్న యుద్ధానికి తెరదించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం మేలని, దానికి బదులుగా ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడం కోసం జెలెన్స్కీ శుక్రవారం వైట్‌హౌస్‌కు వచ్చారు.
భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా జెలెన్స్కీ ఒత్తిడి చేశారు. ఇది ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించింది. దాంతో చర్చలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. ఒప్పందంపై ఎలాంటి సంతకాలు చేయకుండానే జెలెన్స్కీ వైట్‌హౌస్ నుంచి వెళ్లిపోయారు. ట్రంప్, జెలెన్స్కీ మీడియా ఎదుటే వాగ్వాదానికి దిగడం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపర్చింది.