స్టాక్హోమ్: ప్రపంచ దేశాలు సైన్యంపై చేస్తున్న వ్యయం సరికొత్త రికార్డు స్థాయికి చేరింది. 2021లో ఇది 2 లక్షల 10 వేల కోట్ల డాలర్లు దాటిందని స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI) తెలిపింది. ఇది అంతకుముందు ఏడాదికంటే 0.7 శాతం అధికమని వెల్లడించింది. గతేడాది సైనిక వ్యయం (Military Expenditure) అధికంగా చేసిన దేశాల్లో అమెరికా, చైనా, భారత్ మొదటి మూడు స్థానాల్లో ఉండగా, యూకే, రష్యా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మొత్తం వ్యయంలో ఈ దేశాల వాటా 62 శాతం అని వెల్లడించింది.
కరోనా విజృంభణతో ఆర్థిక వ్యవస్థలు కుదేలైనప్పటికీ ప్రపంచ సైనిక వ్యయం రికార్డు స్థాయిలో పెరిగిందని ఎస్ఐపీఆర్ఐ సీనియర్ రిసెర్చర్ డాక్టర్ డీగో లోపెస్ డా సిల్వ వెల్లడించారు. ఆర్థిక మాధ్యంతో వాస్తవిక వృద్ధి రేటు మందగించిందని, అయినా మీలిటరీ వ్యయం 6.1 శాతం అధికమయిందన్నారు. ప్రపంచ జీడీపీలో ఇది 2.2 శాతంగా ఉందని చెప్పారు. కాగా, 2020లో సైనిక వ్యయం 2.3 శాతంగా ఉన్నది.
గతేడాది సైనిక వ్యయం అధికంగా చేసిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. 2021లో అగ్రరాజ్యం 801 బిలియన్ డాలర్లు ఖర్చు చేసిందని నివేదిక వెల్లడించింది. ఇది 2020 నాటికంటే 1.4 శాతం తక్కువ అని తెలిపింది. అయితే 2012 నుంచి 2021 మధ్య మిలిటరీ రిసెర్చ్, డెవలప్మెంట్పై చేసే వ్యయం 24 శాతం పెరిగిందని, ఆయుధాల కొనుగోళ్లపై 6.4 శాతం అధికమయిందని వెల్లడించింది. ఇక చైనా.. రక్షణ విభాగానికి 293 బిలియన్ డాలర్లు ఖర్చుచేసిందని, 2020 కంటే ఇది 4.7 శాతం అధికమని పేర్కొన్నది.
సైన్యంపై అత్యధికంగా వెచ్చిస్తున్న దేశాల్లో మూడో స్థానంలో భారత్.. 2021లో 76.6 బిలియన్ డాలర్లు ఖర్చు చేసిందని తెలిపింది. అంతకుముందు ఏడాది కంటే ఇది 0.9 శాతం అధికమని తెలిపింది. 2012 నుంచి భారత సైనిక వ్యయం 33 శాతం పెరిగింది. మిలిటరీ బడ్జెట్లో ఆయుధాలు సమకూర్చుకోవడానికే 64 శాతం నిధులు ఖర్చు చేస్తున్నదని పేర్కొన్నది.
ఇక యునైటెడ్ కింగ్డమ్ 68.4 బిలియన్ డాలర్లు, రష్యా 65.9 బిలియన్ డాలర్లు వెచ్చించాయని ఎస్ఐపీఆర్ఐ తన నివేదికలో వెల్లడించింది. ఇవి 2020లో కంటే 3 శాతం, 2.9 శాతం అధికమని తెలిపింది. 2021లో పెరిగిన ముడిచమురు ధరలు రష్యా తన మిలటరీ వ్యయాన్ని అధికం చేయడానికి దోహదపడ్డాయని చెప్పింది.