Iran-US : అమెరికా–ఇరాన్ మధ్య చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. తాజాగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో చేసిన ప్రకటనే దీనికి నిదర్శనం. మరికొన్ని గంటల్లోనే ప్రపంచం శుభవార్త వినబోతుంది అంటూ రుబియో తాజాగా ప్రకటించారు. భారత పర్యటనలో ఉన్న రుబియో ఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌తో కలిసి ఆదివారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇరాన్‌తో యుద్ధం, శాంతి చర్చల విషయంలో ప్రపంచం మరికొన్ని గంటల్లో శుభవార్త వినే అవకాశం ఉందన్నారు. హార్ముజ్ జలసంధి, ఇరాన్ అణు కార్యక్రమం విషయంలో చర్చల్లో పురోగతి కనిపించిందని రుబియో అన్నారు. రెండు దేశాల మధ్య చర్చల్లో కీలకంగా నిలిచిన అంశాలివే. యురేనియం అప్పగించాల్సిందే అని అమెరికా డిమాండ్ చేస్తోంది. ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం కుదిరితే ఇరాన్–అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగిసే అవకాశాలున్నాయి.
మరోవైపు.. శుద్ధి చేసిన యురేనియంను అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించినట్లు సమాచారం. ఒకవేళ తమ డిమాండ్లకు ఇరాన్ అంగీకరించకపోతే శాంతి చర్చలు విఫలమయ్యే అవకాశం ఉంది. దీంతో మళ్లీ సైనిక చర్యకు దిగేందుకు సిద్ధమని అమెరికా ప్రకటించింది. ఇందుకోసం ముందస్తు ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఏదేమైనా ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. అన్నింటిమీదా ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. మరోవైపు ఇండియాతో చర్చలపై మార్కో రుబియో కీలక ప్రకటన చేశారు. ఇండియా తమకు అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి అన్నారు.
ప్రపంచంలోని రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య ప్రజాస్వామ్య విలువలు, వ్యూహాత్మక అంశాలతో సంబంధాలు పెంచుకుంటున్నామన్నారు. రెండు దేశాల ప్రయోజనాలు ఒక్కటైనప్పుడు, ఆ దేశాల మధ్య సమస్యలు పరిష్కారమవుతాయని, ఇదే వ్యూహాత్మక భాగస్వామ్యం అన్నారు.