COP 29 | బాకూ, నవంబర్ 11: ‘పారిస్ ఒప్పంద’ లక్ష్యాలు ప్రమాదంలో పడ్డాయని, మరోవైపు 2024 ఏడాదిలో ఉష్ణోగ్రతలు సరికొత్త రికార్డులను చేరుకోనున్నాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచానికి పెను సవాల్‌గా మారిన వాతావరణ మార్పులను కట్టడి చేసేందుకు ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న ‘కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్’ (కాప్)-29 సదస్సు సోమవారం అజర్ బైజాన్ రాజధాని ‘బాకూ’లో ప్రారంభమైంది.
ఐరాస చీఫ్ గుటెరస్, ప్రపంచ వాతావరణ సంస్థ చీఫ్ సెలెస్టీ సాలో మాట్లాడుతూ, పర్యావరణ మార్పులపై ఆందోళన వ్యక్తం చేశారు. పారిస్ ఒప్పంద లక్ష్యాలను అందుకునేందుకు ప్రపంచ దేశాలు వీలైనంత తొందరగా కదలాలని, లక్ష్యాలను విడిచిపెట్టవద్దని సెలెస్టీ సాలో ప్రపంచ దేశాలను కోరారు.
నవంబర్ 11 నుంచి 22 వరకు జరగనున్న ‘కాప్’ సదస్సుకు వివిధ దేశాల నాయకులు, పర్యావరణ నిపుణులు హాజరవుతున్నారు. పారిస్ వాతావరణ ఒప్పందం అమలు, కాలుష్య నియంత్రణ కోసం వర్ధమాన దేశాలకు ఆర్థిక సాయం వంటి కీలక అంశాలు చర్చకు రానున్నాయి. సదస్సును ప్రారంభిస్తూ సాలో కీలక వ్యాఖ్యలు చేశారు. మంచు కరిగి, సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని, అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీంతో ప్రపంచవ్యాప్తంగా సమాజం, ఆర్థికరంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.