న్యూఢిల్లీ, జూలై 6 : నయా భారత్, వికసిత్ భారత్ అంటూ కేంద్రంలోని బీజేపీ పెద్దలు పదేపదే ప్రకటనలు గుప్పిస్తున్న తరుణంలో పలు అంతర్జాతీయ సంస్థలు వెలువరిస్తున్న నివేదికలు వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. బీజేపీ పాలనలో అనేక ప్రగతి సూచీల్లో దేశం ఏటికేడు దిగజారుతున్నది. తాజాగా ప్రపంచ బ్యాంకు వెలువరించిన నివేదికలోనూ ఇదే విషయం వెల్లడైంది. ఇటీవల తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పొరుగుదేశం శ్రీలంక కూడా మన కంటే మెరుగ్గా ఉన్నదని వరల్డ్ బ్యాంక్ వెల్లడించింది. ఈ సంస్థ తాజాగా వెలువరించిన నివేదికలో, శ్రీలంక ఎగువ మధ్య ఆదాయ దేశాల జాబితాలో చేరగా, భారత్ మాత్రం దిగువ మధ్య ఆదాయ విభాగంలోనే మిగిలిపోయింది. విభిన్న ఆర్థిక ప్రగతి మార్గాలను గుర్తించిన ప్రపంచ బ్యాంకు తన తాజా ఆదాయ వర్గీకరణలో శ్రీలంక, వియత్నాం, ఫిలిప్పీన్స్లను ఉన్నత-మధ్య-ఆదాయ వర్గానికి చేర్చింది. కేవలం కొన్ని సంవత్సరాల క్రితమే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న శ్రీలంకకు ఇది ఒక పెద్ద ఊరటగా పరిణమించింది. అయితే భారత్ మాత్రం 2007 నుంచి తన దిగువ-మధ్య-ఆదాయ స్థితిని కొనసాగిస్తున్నది.
2022లో సార్వభౌమ రుణ ఎగవేతకు, సుమారు 5,100 కోట్ల డాలర్ల విదేశీ రుణాల చెల్లింపుల నిలిపివేతకు దారితీసిన ఆర్థిక సంక్షోభం నుండి శ్రీలంక కోలుకోవడాన్ని ఆ దేశం తిరిగి ఉన్నత-మధ్య-ఆదాయ వర్గంలోకి రావడం తెలియచేస్తుంది. పరిశ్రమలు, పర్యాటకం, ఆర్థిక సేవల రంగంలో విస్తృతమైన పునరుత్తేజం కారణంగా 2025లో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ 5% వృద్ధిని సాధించిందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. శ్రీలంక ఈ మైలురాయిని అతి తక్కువ తేడాతోనే అధిగమించిందని పేర్కొంటూనే ఈ వృద్ధిని కోలుకునే ప్రక్రియకు సంబంధించిన కథగా ప్రపంచ బ్యాంక్ అభివర్ణించింది.

ఆర్థిక వ్యవస్థలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంక్ తలసరి స్థూల జాతీయ ఆదాయాన్ని(జీడీఐ) ఉపయోగిస్తుంది. జీఎన్ఐ అనేది ఒక దేశంలోని నివాసితులు, వ్యాపార సంస్థలు ఎక్కడ ఆదాయాన్ని ఆర్జించినప్పటికీ పొందిన మొత్తం ఆదాయాన్ని కొలుస్తుంది. ఆపై, తలసరి సగటు ఆదాయాన్ని లెక్కించడానికి ఆ మొత్తాన్ని జనాభాతో భాగిస్తుంది. ప్రస్తుత వర్గీకరణ ప్రకారం తలసరి జీఎన్ఐ 1,136 డాలర్ల నుండి 4,495 డాలర్ల వరకు ఉన్న ఆర్థిక వ్యవస్థలు దిగువ-మధ్య-ఆదాయ వర్గంలోకి వస్తారు. తలసరి జీఎన్ఐ 4,496 డాలర్ల నుండి 13,935 డాలర్ల వరకు ఉన్నవి ఎగువ-మధ్య-ఆదాయ వర్గంలోకి వస్తాయి. భారత్ తలసరి జీఎన్ఐ సుమారు 2,500-2,700 డాలర్లుగా ఉంది.
ఆర్థిక, సామాజిక, విద్య, వైద్యం, పారిశ్రామిక తదితర రంగాల్లో.. పౌరస్వేచ్ఛ, పత్రికాస్వేచ్ఛ, లింగ సమానత్వం, పాస్‌పోర్ట్, భద్రత వంటి 50కిపైగా సూచీల్లో భారత్ చిట్టచివరన ఉన్నదని ఆయా నివేదికల ర్యాంకులను బట్టి తెలుస్తున్నది. ఆకలి సూచీలో సూడాన్, రువాండా, కాంగో వంటి దేశాలతో భారత్ పోటీపడుతున్న పరిస్థితి నెలకొన్నది. ప్రజాస్వామ్య సూచీలో 46వ ర్యాంకు పడిపోయింది. హెల్త్ అండ్ సర్వైవల్ ఇండెక్స్‌లో 2014లో 114వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం 143వ ర్యాంకుకు పడిపోయింది. ఆనందమయ దేశాల్లో 116కు పతనమైంది. పింఛన్ సూచీలోనూ అట్టడుగున నిలిచింది. పత్రికా స్వేచ్ఛలో 151వ స్థానం నుంచి 157కు దిగజారింది.