న్యూఢిల్లీ: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలోకి ఎంటరైన అమెరికా.. ఇరాన్ అణుస్థావరాలపై భీకరదాడులకు దిగింది. ఈ దెబ్బతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. మరోవైపు, అమెరికా దాడిపై తీవ్రంగా స్పందించిన ఇరాన్.. అమెరికాకు మర్చిపోలేని గుణపాఠం చెప్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ ఎన్ని రకాలుగా ప్రతీకారం తీర్చుకోవచ్చన్న దానిపై నిపుణులు పలు అంశాలను తెరపైకి తెచ్చారు.
ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతానికిపైగా హర్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతున్నది. ఇప్పుడు ఇరాన్ దీనిని చక్కని అవకాశంగా వినియోగించుకునే వీలుంది. ఇరాన్ కనుక ఇప్పుడు దీనిని మూసివేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంది.
ఈ ప్రాంతంలో అమెరికా 10 వేల మంది సైనికులను మోహరించింది. వాటిలో ఖతర్, బహ్రెయిన్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అరబ్ గల్ఫ్ దేశాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ కంటే ఇవి చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ స్థావరాలు కూడా ఇజ్రాయెల్ మాదిరిగానే అధునాతన వాయు రక్షణ వ్యవస్థను కలిగి ఉన్నాయి. కానీ, క్షిపణి, సాయుధ డ్రోన్ల ద్వారా దాడి చేస్తే హెచ్చరిక సమయం చాలా తక్కువ. అక్కడికి అనేక వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్ కూడాఅడ్డుకోలేకపోవచ్చు. అమెరికా బేస్‌లను ఇరాన్ లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్ దాడులతో విరుచుకుపడే అవకాశం ఉన్నది. 2019లో సౌదీ అరేబియాలోని రెండు చమురు క్షేత్రాలు, మౌలిక సదుపాయాలపై జరిగిన దాడిని గుర్తుచేస్తూ ఇరాన్ మళ్లీ ఆ తరహా దాడులకు దిగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇరాన్‌కు అనుబంధంగా పనిచేస్తున్న హౌతీలు (యెమన్), హిజ్బొల్లా (లెబనాన్), హమాస్, ఇరాక్‌లోని మిలీషియా వంటి బలగాలను ఉపయోగించుకోవడం ద్వారా పరోక్షంగా అమెరికాకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఇవి తమ భూభాగాల నుంచి ఇజ్రాయెల్‌పై దాడులకు దిగాయి. 1990లలో అర్జెంటినాలోని యూదు కమ్యూనిటీ సెంటర్‌పై దాడిని గుర్తుచేస్తున్నారు. ఈ దాడికి ఇరాన్, హిజ్బొల్లానే కారణమన్న ఆరోపణలున్నాయి.
ఇరాన్ తన కార్యక్రమం శాంతియుతమైనదని చెప్తున్నది. కానీ, యురేనియంను 60 శాతం వరకు శుద్ధి చేసిన ఏకైక అణ్వాయుధేతర దేశం ఇదే. ఇది ఆయుధ గ్రేడ్ స్థాయిలను 90 శాతానికి పెంచుకునేందుకు ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నది.