Iran-US | ఇరాన్ పై దాడి చేసేందుకు అమెరికా సిద్ధమవుతున్న వేళ.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈసారి దాడి చేస్తే.. తాము గట్టిగా బదులిస్తామని హెచ్చరించింది. తమ దేశంపై ఎలాంటి సైనిక దాడి జరిగినా.. దాన్ని పూర్తి స్థాయి యుద్ధంగానే పరిగణిస్తామని తెలిపింది. ఇరాన్ లో సంక్షోభం నేపథ్యంలో ఆ దేశంపై దాడి చేయడానికి అమెరికా ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. యుద్ధ నౌకల్ని మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి తరలించింది.
దీంతో తమపై దాడి తప్పదేమోనని ఇరాన్ భావిస్తోంది. అందుకే ఈ అంశంపై ఇప్పుడు ఇరాన్ కూడా అప్రమత్తమైంది. తమ దేశానికి చెందిన సైనిక శక్తిని పూర్తిగా సిద్ధం చేసినట్లు ఇరాన్ అధికారి ఒకరు వెల్లడించారు. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని తెలిపారు. ఇరాన్ పై జరిగే పరిమిత లేదా అపరిమిత, సర్జికల్, కైనెటిక్.. ఇలా ఏ రకమైన దాడినైనా బలంగా ప్రతిఘటిస్తామని అధికారి తెలిపారు. ప్రస్తుతం తమ మిలిటరీ సంసిద్ధత పూర్తిస్థాయి యుద్ధ సన్నాహకంగా లేకపోయినా.. ఏ దాడినైనా ప్రతిఘటించి తీరుతామన్నారు. అందుకే ఇప్పటికే హై అలర్ట్ లో ఉన్నట్లు చెప్పారు. ఇరాన్ సమగ్రతను, సార్వబౌమత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే తాము తగిన విధంగా స్పందిస్తామని ఇరాన్ వివరించింది.
అమెరికా తమ దేశంపై దాడుల గురించి హెచ్చరిస్తూనే ఉందని, మేం తాము ఏ దాడినైనా తిప్పికొడతామని, కుదిరితే మాపై ఇకపై ఎవరూ దాడి చేయకుండా చూసుకుంటామని అధికారి తెలిపారు. కాగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఇరాన్ పై దాడికి సిద్ధపడుతున్నాడు. తమ దగ్గర తగిన ఆయుధాల్ని సిద్ధం చేశామని ఆయన తెలిపారు. ఇప్పటికే పలు చోట్ల యుద్ధ నౌకలు, విమానాల్ని రెడీగా ఉంచిన అమెరికా.. ఇరాన్ పై నిజంగానే దాడి చేస్తుందా.. లేక ఆగిపోతుందా అనేది చూడాలి.