తైవాన్ విషయంలో తాము యుద్ధానికి కూడా సిద్ధమని చైనా తేటతెల్లం చేసింది. సింగపూర్ వేదికగా అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌తో చైనా రక్షణ మంత్రి వు కియాన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తైవాన్‌లో అలజడి సృష్టించే చర్యలను వదులుకోవాలని అమెరికా మంత్రి చెప్పారు. దీంతో అగ్గిమీద గుగ్గిలమైన వు కియాన్.. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమని, దాన్ని చూపించి చైనాపై ఒత్తిడి పెంచడం మానుకోవాలని తేల్చిచెప్పారు.
ఒకవేళ తైవాన్ గనుక స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటే.. యుద్ధం చేయడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని చైనా రక్షణ మంత్రి స్పష్టంచేశారు. ‘స్వతంత్ర తైవాన్’ పథకాలన్నింటినీ ధ్వంసం చేస్తామని, మాతృభూమిని ఏకం చేస్తామని అమెరికా మంత్రికి తేటతెల్లం చేశారు.