బ్రిటన్ కొత్త ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు దేశాల అధినేతలు రిషికి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖలు రాశారు. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం మిన్నకుండిపోయారు. రిషి సునాక్కు శుభాకాంక్సలు తెలపలేదు.
ఆయన అలా ఎందుకు చేశారో రష్యా ప్రభుత్వం వివరించింది. ప్రస్తుతం బ్రిటన్ దేశం తమ మిత్రదేశాల జాబితాలో లేదని, అది ‘అన్ఫ్రెండ్లీ’ (స్నేహసంబంధాలు లేని) దేశాల జాబితాలో ఉందని రష్యా ప్రభుత్వం వెల్లడించింది. ఈ కారణంగానే పుతిన్ నుంచి రిషికి ఎలాంటి శుభాకాంక్షలు రాలేదని వివరించింది.
ఈ విషయాన్ని పుతిన్ ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం ఇదే విషయంపై స్పందించిన రష్యా.. రిషి సునాక్ నేతృత్వంలో యూకేతో తమ బంధాలు మెరుగవుతాయనే ఆశ తమకు ఏమాత్రం లేదని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.