Covid | వాషింగ్టన్ : అమెరికాలో కొవిడ్-19 వైరస్ విజృంభిస్తున్నది. వందల్లో మరణాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు వంటి హైరిస్క్ గ్రూప్ వారికి కరోనా ప్రాణ సంకటంగా మారిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో గత నెల రోజుల్లో సగటున వారానికి 350 వరకు కరోనా మరణాలు నమోదైనట్టు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) గణాంకాలు చెప్తున్నాయి. ఇవి మరింత పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికం ఎన్బీ.1.8.1 వేరియంట్‌వే అని సీడీసీ తెలిపింది. చైనాలో మళ్లీ కొవిడ్ కేసులు పెరగడానికి, ఇతర ఆసియా దేశాల్లో కేసులు నమోదు కావడానికి ఈ వేరియంటే కారణం.
కొత్త వేరియంట్ కేసులు అమెరికాలోని వాషింగ్టన్, కాలిఫోర్నియా, న్యూయార్క్ సిటీ, వర్జీనియా తదితర రాష్ర్టాల్లో రోజూ నమోదవుతున్నాయని అధికారులు చెప్తున్నారు. ఆయా రాష్ర్టాల్లోని విమానాశ్రయాల్లో విదేశీ పర్యాటకులకు పరీక్షలు నిర్వహించగా ఎన్బీ.1.8.1 వేరియంట్ బాధితులను గుర్తిస్తున్నట్టు తెలిపారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్ తదితర దేశాల ప్రయాణికుల్లో ఈ వైరస్‌ను గుర్తిస్తున్నామన్నారు. ఒహియో, హవాయి తదితర రాష్ర్టాల్లో స్థానికుల్లోనూ ఈ వైరస్ సోకిందన్నారు. ఈ పరిణామాలపై డ్యూక్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ టోనీ మూడీ స్పందిస్తూ.. ‘ఈ స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయంటే వైరస్ మన చుట్టూ వ్యాపించి ఉన్నదని అర్థం. సమీప భవిష్యత్తులో కేసులు మరింత పెరిగే అవకాశం ఉన్నది’ అని పేర్కొన్నారు. అమెరికాలో వ్యాక్సినేషన్ తక్కువగా నమోదవడం, ప్రజల్లో రోగనిరోధక శక్తి క్షీణించడం, సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వంటి కారణాల వల్లే కొవిడ్ విజృంభిస్తున్నదని స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ, మే 27 : దేశంలో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. సోమవారం నాటికి దేశవ్యాప్తంగా 1,010 కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్తున్నారు. అప్రమత్తంగా ఉంటూ సాధారణ నివారణ చర్యలు పాటిస్తే చాలని స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ లాంటి రాష్ర్టాల్లో కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ గత వేవ్‌లతో పోలిస్తే ప్రస్తుతం ఈ ఇన్ఫెక్షన్ సోకినవారి సంఖ్య చాలా తక్కువేనని తెలిపారు. కొవిడ్ బారిన పడినవారిలో వ్యాధి తీవ్రత చాలా తక్కువగా ఉండటంతో అత్యధిక రోగులకు ఓపీడీ (ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్)లోనే సేవలందించి పంపించేస్తున్నామని, కేవలం కొద్ది మందికి మాత్రమే హాస్పిటల్లో చేరాల్సిన అవసరం ఏర్పడుతున్నదని వైద్యులు చెప్తున్నారు. ఎవరికైనా దగ్గు, గొంతు నొప్పి లేదా ఫ్లూ లాంటి లక్షణాలుంటే ఇండ్లకే పరిమితమై వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఏ రోగికైనా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నదని భావించి వైద్యుడు సూచిస్తే తప్ప మిగతావారు బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.