న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వ్యాప్తికి, ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొచ్చేందుకు పరిస్ధితులు అనుకూలంగా ఉన్నా మనం మహమ్మారి అంతానికి సంసిద్ధమైనరోజు అది అంతమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియేసస్ అన్నారు. జర్మనీలో జరుగుతున్న మునిచ్ సెక్యూరిటీ సదస్సు 2022 లైవ్ సెషన్లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహమ్మారి నుంచి బయటపడటంపైనే ప్రపంచం దృష్టిసారించాలని ఆయన నొక్కిచెప్పారు.
రెండేండ్ల కిందట మనం కలుసుకున్నప్పుడు వైరస్ గుప్పిట్లోకి జారుతున్నామని, అయితే మహమ్మారి మూడో ఏడాదిలోకి మనం ఇలా అడుగుపెడతామని అప్పట్లో ఏ ఒక్కరూ ఊహించలేదని అన్నారు. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా మనమందరం సమాయాత్తమైతే మహమ్మారి ఎంతగా వ్యాప్తి చెందుతూ ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొచ్చినా దాన్ని మనం కట్టడి చేసి అంతం చేయవచ్చని అన్నారు. కొన్ని దేశాల్లో వ్యాక్సిన్లు అధికంగా ఇవ్వడంతో పాటు ఒమిక్రాన్ తీవ్రత తక్కువగ ఉండటంతో మహమ్మారి ముగిసిందనే ప్రచారం సాగిస్తున్నారని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ హెచ్చరించారు.
అయితే మహమ్మారి అంతం కాలేదని, మనతోనే ఉందని వ్యాఖ్యానించారు. అయితే మహమ్మారిని దీటుగా ఎదుర్కొనేందుకు మన వద్ద పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఉందని వ్యాక్సిన్ల తయారీ, పరీక్షలు, చికిత్స, పీపీపీ కిట్లు అన్ని దేశాల్లో అందుబాటులో ఉండటానికి అవసరమైన రూ 1600 కోట్ల డాలర్ల నిధులను సమకూర్చుకోవాలని స్పష్టం చేశారు. పేద దేశాలకూ టీకాల పంపిణీ సజావుగా జరిగితేనే మహమ్మారిపై దీటుగా పోరాడవచ్చని అన్నారు.