Asaduddin Owaisi | న్యూఢిల్లీ, ఏప్రిల్ 28 : సింధూ నదిలో నీరు పారకపోతే రక్తం పారుతుంది అని భారత్‌ను హెచ్చరిస్తూ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) అధినేత, మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలకు ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా సమాధానమిచ్చారు. తన తల్లి, పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోను, తన తాత, పాకిస్థాన్ తొలి అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టోను ఎవరు చంపారో జర్దారీ గుర్తు చేసుకోవాలని ఒవైసీ సోమవారం హితవు చెప్పారు.
‘తన తాతకు ఏం జరిగిందో అతనికి తెలియదా? తన తల్లిని ఎవరు చంపారో అతనికి తెలియదా? ఉగ్రవాదులను వెనకేసుకొస్తూ అతను ఆ విధంగా మాట్లాడకూడదు. అసలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా తెలుసా? అమెరికా నిధులు ఇవ్వకపోతే దేశాన్ని నడపలేని మీరు మా గురించి మాట్లాడతారా?’ అంటూ బిలావల్‌ను ఆయన నిలదీశారు.