న్యూయార్క్: రష్యా తమ యాప్‌ను బ్లాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నదని అమెరికాకు చెందిన సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్(WhatsApp) ఆరోపించింది. వాట్సాప్ యాప్.. మెటా ప్లాట్‌ఫామ్‌కు చెందినదని, దాని వల్లే రష్యా ఆ యాప్‌ను వ్యతిరేకిస్తున్నట్లు సంస్థ పేర్కొన్నది. ఎన్‌క్రిప్ట్ సేవల్ని అందిస్తున్న వాట్సాప్‌ను నిషేధించేందుకు రష్యా ప్రయత్నిస్తున్నట్లు మెటా సంస్థ వెల్లడించింది. టెలిగ్రాంతో పాటు వాట్సాప్ కాల్స్‌ను కూడా నియంత్రించేందుకు రష్యా యత్నిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భద్రతా వ్యవస్థలకు మోసం, ఉగ్రవాద కేసులకు చెందిన సమాచారాన్ని ఇవ్వడం లేదని విదేశీ సంబంధిత ప్లాట్‌ఫామ్‌లపై రష్యా ఆధిపత్యం ప్రదర్శిస్తున్నట్లు వాట్సాప్ ఆరోపించింది.
సుమారు పది కోట్ల మంది రష్యా ప్రజలకు వాట్సాప్‌ను అక్కడ ప్రభుత్వం బ్లాక్ చేస్తున్నదని కంపెనీ ఓ ప్రకటనలో ఆరోపించింది. రష్యాలో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్ కమ్యూనికేషన్ ప్రతి ఒక్కరికీ చేరవేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వాట్సాప్ వెల్లడించింది. చాన్నాళ్ల నుంచి విదేశీ టెకీ ప్లాట్‌ఫామ్‌ల విషయంలో రష్యా తన పోరు సాగిస్తోంది. ఉక్రెయిన్ దాడి తర్వాత ఆ దేశ ఇంటర్నెట్ ఆధిపత్యం కోసం రష్యా ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గవర్నమెంట్ సేవలతో మిళితమైన ప్రభుత్వ యాప్‌ను తయారు చేయాలని ఇటీవల పుతిన్ ఆదేశాలు జారీ చేశారు. వాట్సాప్, టెలిగ్రాం లాంటి సేవలపై ఆధారపడవద్దు అని ఆదేశించారు.