Ali Khamenei | జెరూసలెం: ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల దాడితో పశ్చిమాసియా మొత్తం నిప్పుల గుండంలా మారింది. ఏ క్షణాన ఏం జరగబోతున్నదో తెలియటం లేదు. ఇరాన్ దాడిపై నెతన్యాహూ స్పందిస్తూ.. ‘ఇరాన్ నాయకులు మా బలాన్ని, ప్రతిదాడి సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేశారు. వారు అర్థం చేసుకొనేలా ప్రతి దాడి చేస్తాం’ అని స్పష్టంచేశారు. దీంతో ఇజ్రాయెల్ టార్గెట్‌గా ఇరాన్ మారిందన్న సంకేతాలు వచ్చాయి. అటు.. టెల్అవీన్పై దాడుల వెనుక, ఆ ప్రాంతంలో అస్థిరత్వానికి ఇరాన్ సుప్రీం లీడరే కారణం అని ఇజ్రాయెల్ సైనికాధికారులు అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో ఐడీఎఫ్ గురి ఇరాన్ టాప్ లీడర్ ఖమేనీపై ఉన్నట్టు తెలుస్తున్నది. ఇరాన్‌పై దాడిచేసే క్రమంలో ఆ దేశానికి ఆయువు పట్టులా ఉన్న ఆర్థిక, కమ్యూనికేషన్ వ్యవస్థను దెబ్బతీసే అవకాశాలున్నాయి. చమురు, గ్యాస్, కమ్యూనికేషన్లు, బ్యాంకింగ్ తదితర రంగాలే తమ లక్ష్యం అని ఐడీఎఫ్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
తమ దేశంపై క్షిపణి దాడులకు పాల్పడి ఇరాన్ పెద్ద తప్పు చేసిందని, ఇందుకు ఆ దేశం మూల్యం చెల్లించాల్సిందేనని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ హెచ్చరించారు. బుధవారం ఇజ్రాయెల్ భద్రతా బలగాల అధినేతలతో నెతన్యాహూ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇరాన్‌లోని ముఖ్యమైన లక్ష్యాలను తాము గుర్తించి, శక్తిమంతంగా దాడులు చేయగలమని ఇజ్రాయెల్ సైన్యాధ్యక్షుడు హెర్జి హలేవీ హెచ్చరించారు.