అమెరికా, జూన్ 5: ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీపై ఇప్పటికే పలు ఆంక్షలు విధించిన డొనాల్డ్ ట్రంప్ సర్కారు.. తాజాగా కొలంబియా యూనివర్సిటీతోనూ పేచీకి దిగింది. వర్సిటీ గుర్తింపు రద్దు చేస్తామంటూ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి తర్వాత యూదు విద్యార్థుల రక్షణలో విశ్వవిద్యాలయం విఫలమైందని, ఇది యూదుల పట్ల విద్వేషం ప్రదర్శించడమేనని ట్రంప్ ప్రభుత్వ అధికారి ఆరోపించినట్టు బీబీసీ కథనం పేర్కొంది.
హార్వర్డ్ వర్సిటీపై ట్రంప్ సర్కారు ఆంక్షలను మరింత తీవ్రం చేసింది. హార్వర్డ్ వర్సిటీలోకి విదేశీ విద్యార్థుల ప్రవేశాల కోసం వీసాల జారీని నిలిపివేస్తూ మరోసారి ఉత్తర్వులు వెలువరించింది. నెలక్రితం ఇదే తరహా ఉత్తర్వులు వెలువరించగా ఇటీవల బోస్టన్ ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. తాజాగా చట్టంలోని ఇతర నిబంధనలను పేర్కొంటూ ప్రకటన విడుదల చేశారు. ట్రంప్ ఆదేశాలను హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులు ఖండించారు. ఇది కక్షసాధింపు చర్యగా అభివర్ణించారు.
తమ విదేశీ విద్యార్థులను సంరక్షించుకుంటామని స్పష్టంచేశారు. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ట్రంప్ సర్కారు ఆదేశాలను పాటించకపోవడం వల్లే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. వీసాల రద్దు నిర్ణయమే కాకుండా వర్సిటీకి, ట్రంప్ సర్కారుకు మధ్య పలు అంశాలపై విభేదాలు కొనసాగుతున్నాయి. నెల క్రితం వర్సిటీకి విడుదల చేయాల్సిన 450 మిలియన్ డాలర్ల నిధులను ప్రభుత్వం నిలిపివేసింది.