వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం క్యూబాను గట్టిగా హెచ్చరించారు. “ఇక క్యూబాకు చమురు, నిధులు వెళ్లవు-సున్నా! బాగా ఆలస్యమవడానికి ముందే ఒప్పందం కుదుర్చుకోవాలని నేను గట్టిగా చెప్తున్నాను” అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో హెచ్చరించారు. చాలా కాలం నుంచి వెనెజువెలా నుంచి వచ్చే చమురు, నిధులతో క్యూబా బతుకుతున్నదన్నారు. అందుకు ప్రతిఫలంగా వెనెజువెలాను పాలించిన చివరి ఇద్దరు నియంతలకు భద్రతా సేవలను అందించిందన్నారు. ఇది ఇకపై ఉండదని చెప్పారు. గత వారం అమెరికా దాడుల్లో ఈ క్యూబన్లే అత్యధికులు చనిపోయారని చెప్పారు. అమెరికా సైన్యం ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైనదని, అటువంటి అమెరికా రక్షణలో వెనెజువెలా ప్రస్తుతం ఉందని చెప్పారు. క్యూబా అధ్యక్షుడు మిగుయెల్ డియాజ్-కనెల్ శనివారం హవానాలోని అమెరికా ఎంబసీ వెలుపల వేలాది మందిని ఉద్దేశించి మాట్లాడారు. వెనెజువెలాపై అమెరికా దాడిని రాజ్య ఉగ్రవాదంగా అభివర్ణించారు. అమెరికాకు వెనెజువెలా వల్ల ఎటువంటి ముప్పు లేదని, అలాంటి దేశం మీద సైనిక దాడికి పాల్పడటం అంతర్జాతీయ చట్టాలను దిగ్భ్రాంతికరంగా ఉల్లంఘించడమేనని చెప్పారు. ఇదిలావుండగా, ట్రంప్ ఇటీవల మిగుయెల్తో మాట్లాడి, చర్చలకు రావాలని పిలిచారు.
వెనెజువెలా చమురు సరఫరాను ఆకస్మికంగా నిలిపేయడం వల్ల క్యూబాలో తీవ్ర అస్థిరతకు దారి తీస్తుందని, పెద్ద సంఖ్యలో క్యూబన్లు దేశం విడిచి వెళ్లిపోవలసిన దుస్థితి దాపురిస్తుందని నిపుణులు చెప్తున్నారు. క్యూబన్ విద్యార్థి అమంద గోమెజ్ (16) మాట్లాడుతూ, దేశం విడిచి వెళ్లిపోవాలని చాలా మంది భావిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 3న వెనెజువెలాపై అమెరికా దాడికి పాల్పడటానికి ముందే క్యూబాలో విద్యుత్తు కోతలు తీవ్రంగా ఉండేవి. పెట్రోలు, డీజిల్ బంక్‌ల వద్ద వాహనదారులు బారులు తీరి ఉండేవారు. కిరాణా దుకాణాల వద్ద కూడా పెద్ద సంఖ్యలో కనిపించేవారు. దశాబ్దాల్లో అత్యంత దయనీయ స్థితిలో క్యూబా ఆర్థిక వ్యవస్థ ఉండటంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు వెనెజువెలా చమురును కోల్పోవడంతో సంక్షోభం మరింత తీవ్రమవుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. వాషింగ్టన్ డీసీలోని సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ పాలసీ రిసెర్చ్‌లో సీనియర్ రిసెర్చ్ అండ్ ఔట్రీచ్ అసోసియేట్ మైఖేల్ మాట్లాడుతూ, ఇప్పటికే దయనీయంగా ఉన్న పరిస్థితి తాజా పరిణామాల వల్ల మరింత దిగజారుతుందన్నారు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి ఇది స్పష్టమైన సంకేతమని చెప్పారు.
క్యూబాను అమెరికా స్వాధీనం చేసుకోవాలంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన పోస్ట్‌లను ట్రంప్ రీపోస్ట్ చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో క్యూబా అధ్యక్షుడవుతారం టూ పెట్టిన పోస్ట్‌లపై ట్రం ప్ స్పందిస్తూ, ఇది వీనుల విందుగా ఉందన్నారు.