వాషింగ్టన్: గ్రీన్‌లాండ్‌పై అమెరికా నియంత్రణ ఉండాలన్న తన ఆకాంక్షను ట్రంప్ మరోసారి బయటపెట్టారు. అయితే దీనిపై డెన్మార్క్, గ్రీన్లాండ్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో ట్రంప్ మాట్లాడుతూ తమ జాతీయ భద్రతకు సంబంధించి గ్రీన్లాండ్ చాలా ముఖ్యమైనదని, అక్కడ రష్యన్, చైనా నౌకలు తిష్టవేయడం ఆందోళనకరమని అన్నారు. రక్షణ అవసరాల కోసం గ్రీన్లాండ్ అమెరికాకు కావాలని ఆయన చెప్పారు. కొలంబియా చాలా బలహీనంగా ఉందని, కొకైన్ (మాదకద్రవ్యం) తయారుచేసి అమెరికాకు అమ్మడానికే అనారోగ్యంతో బాధపడుతున్న ఆ దేశ అధ్యక్షుడు ఇష్టపడుతున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆయన ఇక ఎంతో కాలం ఆ పనిచేయలేరని హెచ్చరించారు.
గ్రీన్లాండ్ తమకు కావాలంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడెరిక్సెన్ తీవ్రంగా స్పందించారు. గ్రీన్‌లాండ్‌ని అమెరికా తీసుకోవడం అనే ఆలోచనే అసంబద్ధమైందని ఆమె అన్నారు. డానిష్ రాజ్యంలోని ఏ భూభాగాన్ని స్వాధీనం చేసుకునే అధికారం అమెరికాకు లేదని ఆమె హెచ్చరించారు. తనకు అత్యంత సన్నిహిత మిత్రదేశానికి హెచ్చరికలు జారీచేయడాన్ని ట్రంప్ మానుకోవాలని ఆమె సూచించారు. తమ భూభాగం అమ్మకానికి లేదని గ్రీన్లాండ్ ప్రజలు ఇప్పటికే స్పష్టం చేశారని ఆమె ట్రంప్‌నకు గుర్తు చేశారు.
ఇదిలా ఉండగా వెనెజువెలాలో అమెరికా సైనిక చర్యను గ్రీన్‌లాండ్‌తో ముడిపెడుతూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను మోసపూరితం, అమర్యాదకరంగా గ్రీన్లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడెరిక్ నీల్సెన్ అభివర్ణించారు. భయపడాల్సిన అవసరం లేదని ఆయన దేశ ప్రజలకు ధైర్యం చెప్పారు. స్వతంత్ర ఎన్నికలతో గ్రీన్లాండ్ ఓ ప్రజాస్వామిక సమాజమని, అంతర్జాతీయ చట్టాల మార్గదర్శనలో బలమైన వ్యవస్థలు ఉన్నాయని, గుర్తింపు పొందిన ఒప్పందాలు అమెరికాతో సైతం ఉన్నాయని ఆయన చెప్పారు. జాతీయ భద్రత, ఖనిజ వనరులు, ఆర్కిటిక్ ప్రాంత రష్యా-చైనా కార్యకలాపాలు వంటి విషయాలను ఆయన గుర్తుచేశారు.
వెనెజువెలాను తాము ఆక్రమించుకోలేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సోమవారం స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితిలో అమెరికా చర్యలను దురాక్రమణగా భావించకూడదని ఆయన చెప్పారు. సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెనెజువెలాను అమెరికా ఆక్రమించుకుందా అని అడిగిన ప్రశ్నకు రూబియో జవాబిస్తూ ప్రతి పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధ్యక్షుడు ట్రంప్ వద్ద వేర్వేరు ప్రత్యామ్నాయాలు ఉంటాయని చెప్పారు. వెనెజువెలా భూభాగాన్ని అమెరికా ఆక్రమించుకునే పరిస్థితి లేదని ఆయన చెప్పారు.
కాగా, ఈ నెల 3న వెనెజువెలాను అమెరికా ఆక్రమించుకున్నట్లు సోషల్ మీడియా పోస్టులో ట్రంప్ వెల్లడించిన విషయం తెలిసిందే. వెనెజువెలా కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ట్రంప్ ఆదివారం ప్రకటించారు. ఆ బృందంలో విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీటే హ్యాగ్సెథ్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ బృందం వెనెజువెలాలో శాంతి భద్రతలను అమలు చేయడంలో, ప్రభుత్వ సంస్థల నిర్వహణలో, చమురు, ఇంధనం, భద్రత వంటి కీలక రంగాలు సుస్థిరంగా కొనసాగడంలో తోడ్పడుతుంది.
ఆర్కిటిక్ మహాసముద్రంలో ఉన్న గ్రీన్లాండ్ ద్వీపం వ్యూహాత్మకంగా అమెరికాకు ఎంతో ముఖ్యమైన ప్రదేశం. రష్యా, చైనా సైనిక కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు ఈ ప్రాంతం అమెరికాకు ఎంతో కీలకం. ఈ ద్వీపంలో అత్యంత అరుదైన ఖనిజాలు, చమురు, గ్యాస్ వనరులు అపారంగా ఉన్నాయి. భవిష్యత్తు ఆర్థిక, సాంకేతిక భద్రతకు ఇవి ఎంతో ముఖ్యమని ఆమెరికా భావిస్తున్నది. ఆర్కిటిక్ మంచు ఖండాన్ని మరింత కరిగించడం ద్వారా కొత్త నావికా మార్గాలను ప్రారంభించుకోవచ్చన్నది అమెరికా ఆలోచన. డెన్మార్క్, గ్రీన్లాండ్ డానిష్ రాజ్యంలో భాగంగా ఉన్నాయి. ఇవి నాటోకు చెందిన ఉమ్మడి రక్షణ వ్యవస్థ పరిధిలో ఉన్నాయి. నాటో వ్యవస్థాపక సభ్యదేశమైన డెన్మార్క్‌కు 1951లోనే అమెరికాతో రక్షణ ఒప్పందం ఏర్పడింది. గ్రీన్‌లాండ్‌పై అమెరికా సైనిక కార్యకలాపాలు సాగించుకోవచ్చన్నది ఈ ఒప్పందం సారాంశం.