మోక్వా, మే 31: నైజీరియా దేశం నైగర్ రాష్ట్రంలోని మోక్వా పట్టణంలో భారీ వరదలతో మరణించినవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. శనివారం నాటికి మృతుల సంఖ్య 151కి చేరినట్టు అధికారులు తెలిపారు. గురువారం ఉదయం అకస్మాత్తుగా కుండపోత వర్షం కురువడంతో దాదాపు ఐదు గంటల్లోనే భారీ వరద పట్టణాన్ని ముంచెత్తిందని చెప్తున్నారు. నైగర్ రాష్ట్రంలో వాణిజ్యపరంగా మోక్వా కీలక ప్రాంతమని, ఇక్కడ భారీ ఎత్తున క్రయవిక్రయాలు జరుగుతుంటాయన్నారు.
ముఖ్యంగా రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఇక్కడికి వస్తుంటారని చెప్పారు. దీంతో నిత్యం రద్దీగా ఉంటుందన్నారు. ఈ కారణంగానే మరణాల సంఖ్య భారీగా ఉన్నదని చెప్పారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదన్నారు. వరదలతో 500 ఇండ్లు ధ్వంసం అయ్యాయని, 11 మంది గాయపడ్డారని, 3వేల మంది నిరాశ్రయులు అయ్యారన్నారు. పట్టణానికి రాకపోకలు సాగించే రెండు రోడ్లు, రెండు బ్రిడ్జీలు పూర్తిగా ధ్వంసం అయ్యాయన్నారు.