వాషింగ్టన్: భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి (Trade Deal) చేరువలో ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump Tariffs) వెల్లడించారు. తాము ఇప్పటికే యూకే, చైనాతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, ఇండియాతో కూడా ట్రేడ్ డీల్‌కు దగ్గరలో ఉన్నామని చెప్పారు. ఇక ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకోవాలని అనుకోవడం లేదు. దీంతో లేఖలు పంపిస్తున్నాం అని వెల్లడించారు. ఆసియాలో తమకు అత్యంత కీలకమై భాగస్వాములైన జపాన్, దక్షిణ కొరియాలపై ప్రతీకార సుంకాలను 25 శాతం విధిస్తూ లేఖలు విధించిన వేళ ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు దేశాలతోపాటు బంగ్లాదేశ్, థాయ్‌లాండ్‌లకు ప్రతీకార సుంకాల అమలు ఆగస్టు 1 నుంచి నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ మేరకు జపాన్, దక్షిణ కొరియా దేశాధినేతలకు ట్రంప్ లేఖలు రాశారు.
మీరు ఏ కారణాలవల్ల సుంకాలను పెంచినా ఇప్పుడు మేం విధించిన 25శాతానికి అదనంగా ఆ సుంకాలను వేస్తామని హెచ్చరించారు. ప్రతీకార సుంకాలను పెంచవద్దని, అలా చేస్తే వారి ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు దెబ్బతింటాయని చెప్పారు. నిజానికి 25 శాతం టారీఫ్ చాలా తక్కువేనంటూ వ్యాఖ్యానించారు. ఇది తుది సుంకాలు కాదని, మీ దేశంతో మా సంబంధాలను బట్టి పెరగొచ్చు, తగ్గవచ్చని అందులో పేర్కొన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 2న ప్రపంచ దేశాలపై ట్రంప్ ప్రతీకార సుంకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నది. దీంతో దేశాల మధ్య వాణిజ్య యుద్ధాలకు దారితీసింది. ప్రపంచ స్టాక్ మార్కెట్లలో సంక్షోభం తలెత్తడంతో సుంకాలను 90 రోజులపాటు ట్రంప్ వాయిదా వేశారు. ఈలోగా ఆయా దేశాలు ఒప్పందాలు కుదుర్చుకోవాలని సూచించారు. ఆ గడువు బుధవారంతో ముగియనుంది. దీంతో మరోసారి సుంకాల యుద్ధం తెరమీదకు వచ్చింది.