న్యూఢిల్లీ, జూన్ 19 : ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ పశ్చిమాసియాలోని ఓ సన్నని జల రవాణా మార్గం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు ఉండే హర్మూజ్ జల సంధి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గమని చెప్పవచ్చు. ఈ మార్గాన్ని అడ్డుకోవాలని ఇరాన్ నాయకులు మళ్లీ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇంధనంపై ఆధారపడిన భారత్‌తోసహా అనేక దేశాలు తాజా పరిణామాలపై ఆందోళన చెందుతున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైనిక దాడులు ప్రారంభించిన తర్వాత హర్మూజ్ జలసంధిని మూసివేయాలని పలువురు ఇరానియన్ పార్లమెంట్ సభ్యులు ప్రతిపాదించారు.
ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉందని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డు కోర్ సీనియర్ కమాండర్, పార్లమెంట్ సభ్యుడు ఇస్మాయిల్ కౌసరి ధ్రువీకరించినట్లు ఈరోన్యూస్ వెల్లడించింది. శత్రువును శిక్షించే విషయంలో తమ చేతులు విశాలంగా ఉంటాయని, తమ ప్రతిస్పందనలో సైనిక చర్యలు ఓ భాగం మాత్రమేనని ఆయన చెప్పారు. గతంలో కూడా ఇరాన్ ఈ విధమైన బెదిరింపులకు పాల్పడినప్పటికీ వాటిని ఆచరణలోకి మాత్రం తీసుకురాలేదు. అయితే ప్రస్తుత యుద్ధ పరిస్థితి భిన్నంగా ఉండడంతో ఇరాన్ చేస్తున్న బెదిరింపులు చాలా దేశాలను ఆలోచనలో పడేస్తున్నాయి.
పర్షియన్ గల్ఫ్‌ని అరేబియా సముద్రానికి కలుపుతుంది హర్మూజ్ జలసంధి. ఇరాన్, ఒమన్ మధ్య తక్కువ వెడల్పుతో ఉండే సముద్ర కారిడార్ ఇది. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యూఏఈ, ఖతార్, ఇరాన్ వంటి ఇంధన సంపన్న దేశాల నుంచి ముడి చమురు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(ఎల్ఎన్జీ) ఈ జలమార్గంలోనే ప్రధానంగా ఎగుమతి జరుగుతుంది. ప్రపంచానికి సరఫరా అయ్యే చమురులో దాదాపు 25 శాతం ఈ మార్గం ద్వారా వెలుపలికి వెళుతుందని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ(ఐఈఏ) తెలిపింది. తమపై దాడి చేస్తే ఈ హర్మూజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ పదేపదే హెచ్చరిస్తోందని, ఈ జలసంధి కొద్ది కాలం మూతపడినా ప్రపంచ వ్యాప్తంగా చమురు, సహజవాయువు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఐఈఏ హెచ్చరించింది. హర్మూజ్ జలసంధి ఇరాన్ సముద్ర జలాలలో 20 నాటికల్ మైళ్లు ఉంటుంది. ఈ సముద్ర మార్గంలో నెలకు 3,000కి పైగా వాణిజ్య నౌకలు ప్రయాణిస్తాయి.