Russia | మాస్కో: రష్యాపై ఇటీవల తిరుగుబాటు చేసిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించినట్టు రష్యాకు చెందిన టాస్ న్యూస్ ఏజన్సీ పేర్కొన్నది. అయితే ప్రభుత్వం దీనిని అధికారికంగా నిర్ధారించలేదు. మాస్కో నుంచి సెయింట్ పీట్స్‌బర్గ్ వెళుతున్న ఒక ప్రైవేట్ విమానం బుధవారం మాస్కో ఉత్తర ప్రాంతంలోని ట్విర్ రీజియన్‌లో కూలిపోయింది. ప్రమాదంలో 10 మంది మరణించారు.
వీరిలో ప్రిగోజిన్ పేరు కూడా ఉందని రష్యా వైమానిక సంస్థ రోసావియాట్సియా నిర్ధారించినట్టు టాస్ వెల్లడించింది. అందులో మరణించిన ప్రయాణికుడి పేరు ప్రిగోజిన్ ఇంటిపేరుతో సహా సరిపోయిందని రోసావియాట్సియా తెలిపింది. ప్రిగోజిన్ మరణమే కనుక నిజమైతే అది ప్రమాదం కాకపోవచ్చునని రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
యేవ్జెని ప్రిగోజిన్( Yevgeny Prigozhin) ఒకప్పుడు హాట్ డాగ్స్ అమ్మేవాడు. క్యాటరింగ్ కంపెనీ నడిపాడు. క్రెమ్లిన్‌కు ఫుడ్‌ను సరఫరా చేసేవాడు. పుతిన్ చెఫ్ అన్న నిక్‌నేమ్‌ను అతను సంపాదించుకున్నాడు. ఓ దశలో పుతిన్‌కు సన్నిహితంగా ఉన్నారు. ఆ సమయంలోనే అంటే.. 2014లో మొదటిసారి ఆయన వాగ్నర్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఇది రష్యా ప్రైవేటు మిలటరీ దళంగా పనిచేసేది. ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి యుద్ధం ప్రకటించడంలో పుతిన్‌కు ప్రిగోజిన్ అండగా నిలిచారు.
తూర్పు ఉక్రెయిన్‌లో ఉన్న రష్యా వేర్పాటువాద దళాలకు తొలుత అండగా ఉన్నారు. ఆ సమయంలో ఇదో సీక్రెట్ ఆర్గనైజేషన్. ఈ గ్రూపుకు చెందిన దళాలు ఎక్కువగా ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్‌లో ఆపరేట్ చేశాయి. దాదాపు 5 వేల మంది ఫైటర్లు ఆ దళంలో ఉన్నారు. వీళ్లంతా గతంలో రష్యా ఆర్మీలో చేసినవాళ్లే. గత పదేళ్ల నుంచి ఉక్రెయిన్ బోర్డర్ వెంట రష్యా ఆర్మీకి అండగా వాగ్నర్ గ్రూపు పోరాడింది. కానీ తర్వాత కాలంలో రష్యాకు వ్యతిరేకంగా మారింది. సైనిక తిరుగుబాటుకు దిగింది.