Volodymyr Zelensky | దాదాపు పది నెలలుగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. క్రెమ్లిన్ దాడిలో ఉక్రెయిన్ పూర్తిగా ధ్వంసమవుతోంది. రష్యాను నిలువరించేందుకు అక్కడి సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌కు అమెరికా మొదటి నుంచి సాయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం తర్వాత మొదటి సారి ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. బుధవారం వాషింగ్టన్లో జెలెన్స్కీ పర్యటించనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. అక్కడ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో జెలెన్స్కీ సమావేశం కానున్నారు. అనంతరం కాంగ్రెస్ ఉభయసభల్లో ప్రసంగించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు ముమ్మరంగా పోరు సాగుతున్న బఖ్ముత్ నగరంలో జెలెన్స్కీ మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. అక్కడ సైనిక బలగాలతో ముచ్చటించారు. డాన్బాస్ ప్రాంతం మొత్తాన్ని గుప్పిటపట్టాలన్న రష్యా ప్రయత్నాలు వమ్ముచేస్తూ బఖ్ముత్ను మాత్రం ఉక్రెయిన్ నిలబెట్టుకుంటూ వస్తోంది. తమ భూభాగాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చాటేందుకు ఈ నగరం ఒక ఉదాహరణ అని జెలెన్స్కీ పేర్కొన్నారు.