న్యూఢిల్లీ: ఉత్తర కొరియా(North Korea) సైనికులకు, ఆ దేశాధినేత కిమ్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ థ్యాంక్స్ చెప్పారు. ఉక్రెయిన్ దళాల్ని తిప్పికొట్టడంలో ఉత్తర కొరియా సైనికులు సహకరించినట్లు పుతిన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. కుర్క్స్ బోర్డర్ ప్రాంతం విముక్తి అయిన నేపథ్యంలో రష్యా మిలిటరీ ప్రకటన చేసింది. గత ఆగస్టులో ఉక్రెయిన్ ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నది. అయితే అక్కడ చేపట్టిన ఆపరేషన్‌లో ఉత్తర కొరియా దళాలు పాల్గొన్నాయని, ఆ ప్రాంతాన్ని తిరిగి చేజిక్కించుకున్నట్లు పుతిన్ చెప్పారు.
నార్త్ కొరియా మిత్రులు సంఘీభావం, న్యాయం, స్నేహపూర్వకంగా పోరాడినట్లు పుతిన్ తెలిపారు. నార్త్ కొరియా సైనికులు చూపిన హీరోయిజాన్ని, స్పూర్తి, సాహసాన్ని అభినందిస్తున్నట్లు వెల్లడించారు. తమ దేశాన్ని వాళ్లు స్వదేశంగా భావించి డిఫెండ్ చేశారన్నారు. రష్యా సైనికులతో కలిసి వాళ్లు భుజం భుజం కలిపారన్నారు. వాళ్ల డ్యూటీని చాలా గౌరవప్రదంగా చేసి వైభవాన్ని తీసుకువచ్చినట్లు కొరియా సైనికుల్ని పుతిన్ కొనియాడారు. ప్రాణాలు కోల్పోయిన ఉత్తర కొరియా సైనికులను తగిన రీతిలో గుర్తించనున్నట్లు చెప్పారు.
మరో వైపు ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్‌తో .. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చర్చలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నార్త్ కొరియాతో కొత్త వ్యూహాన్ని అనుసరించాలని ట్రంప్ టీమ్ భావిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. గతంలో నిర్వహించిన దౌత్యపరమైన చర్చలను మళ్లీ ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు. ట్రంప్, కిమ్ భేటీ కోసం వైట్‌హౌజ్ ప్లాన్ చేస్తున్నట్లు కూడా సంకేతాలు అందుతున్నాయి.