Ukraine War : నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. త్వరలోనే ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. శనివారం రష్యాలోని మాస్కోలో జరిగిన విక్టరీ డే సెలబ్రేషన్స్‌లో పుతిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఉక్రెయిన్ యుద్ధం ముగిసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ యుద్ధం ముగించేందుకు యురోపియన్ యూనియన్‌తో కూడా చర్చలు జరుపుతానని పుతిన్ వెల్లడించాడు. ఈయూ అండతోనే ఉక్రెయిన్.. రష్యాపై యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యురోపియన్ యూనియన్ (ఈయూ)తో చర్చల కోసం జర్మనీ మాజీ ఛాన్స్లర్ గెర్హార్డ్ స్క్రోడెర్ పేరును పుతిన్ సూచించారు. ఈ చర్చల ద్వారా ఈయూతో రక్షణ ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కూడా పుతిన్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌తో కాల్పుల ఒప్పందానికి అంగీకరించారు. అలాగే, రెండు దేశాల మధ్య 1,000 మంది సైనిక ఖైదీల అప్పగింతకు కూడా అంగీకరించారు.
యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా, యుక్రెయన్ మధ్య కుదిరిన కీలక ఒప్పందం ఇది. ఈ యుద్ధం 2022, ఫిబ్రవరిలో ప్రారంభమైంది. నాలుగేళ్లైనా ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో రష్యాకు ఉత్తర కొరియా సైన్యం కూడా సహకరించినట్లు ఆరోపణలున్నాయి. తాజాగా మాస్కోలో జరిగిన విక్టరీ పెరేడ్లో కొరియా సైనికులు కూడా పాల్గొనడం ఈ ప్రచారానికి బలం చేకూర్చింది.