హైవేపై మంచి బిజీగా కార్లు వెళ్తున్నాయి. అలాంటి సమయంలో ఆకాశంలో తిరుగుతున్న ఒక సింగిల్ ఇంజిన్ విమానం.. నెమ్మదిగా ఆ రోడ్డుపై ల్యాండయింది. అది చూసిన వాహనదారులు ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ విమానం నడుపుతున్న విసెంట్ ఫ్రేజర్ అనే వ్యక్తి మాజీ మరీన్.
ప్రయాణంలో ఉండగా ఆ చిన్న విమానం ఇంజిన్ ఫెయిలైంది. దీంతో దాన్ని రోడ్డుపై ఎమర్జెన్సీగా దింపేయాలని ఫ్రేజర్ నిర్ణయించుకున్నాడు. రోడ్డుపై వెళ్తున్న కార్లు, ఎత్తుగా ఉన్న ఎలక్ట్రిసిటీ వైర్లను త్రుటిలో తప్పించుకుంటూ చాకచక్యంగా విమానాన్ని రోడ్డుపై ల్యాండ్ చేశాడు.
నార్త్ కరోలినాలోని స్వెయిన్ కౌంటీలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియోను ఫేస్బుక్లో షేర్ చేసిన ఆ సిటీ పోలీసులు.. ఆ సమయంలో ఎలక్ట్రిసిటీ వైర్లు తగిలినా, కార్లకు డ్యాష్ ఇచ్చినా ఎంతో ప్రమాదం జరిగేదన్నారు. కానీ అదృష్టవశాత్తూ ఏమీ జరగలేదని కొనియాడారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఫ్రేజర్ నైపుణ్యాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.