Viral news : అది అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ (White house)..! వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో 145 ఏళ్లనాటి ‘రెసొల్యూట్ డెస్క్’ ఉంది..! ఉడ్రోవిల్సన్, ట్రుమన్, జాన్ ఎఫ్ కెన్నడీ, రీగన్, క్లింటన్, ఒబామా, డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), జో బైడెన్.. ఇలా ఎంతో మంది అమెరికా అధ్యక్షులు ఎన్నో ముఖ్యమైన ఫైళ్లు పెట్టుకొని సంతకాలు చేసిన డెస్క్ అది..! రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ ఇప్పటిదాకా ఆ డెస్క్‌నే ఉపయోగించారు. కానీ అంతటి చరిత్ర ఉన్న ఆ డెస్క్‌ను ట్రంప్ ఇప్పుడు మార్చేశారు. ఎందుకు..? ఏమిటి..? అనేది వివరంగా తెలుసుకుందాం..
ఇటీవల టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో వైట్‌హౌస్ ఓవల్ ఆఫీసులో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మస్క్ తన నాలుగేళ్ల కుమారుడిని కూడా తీసుకెళ్లాడు. సమావేశం సందర్భంగా ఆ బుడతడు మస్క్ భుజాలపైకి ఎక్కుతూ దిగుతూ, ఆఫీస్ అంతా కలియతిరుగుతూ అల్లరి చేశాడు. ఈ క్రమంలోనే ముక్కులో వేలు పెట్టుకొని ఆ వేలును ట్రంప్ ముందున్న ‘రెసొల్యూట్ డెస్క్’కు రుద్దాడు. అయితే అతి పరిశుభ్రత పాటించే ట్రంప్‌కు ఆ బుడ్డోడి చేష్ట కంపరం కలిగించింది.
దాంతో ఆయన వెంటనే రెసొల్యూట్ డెస్క్‌ను ఆఫీసు నుంచి తొలగించాలని ఆదేశించారు. దాని స్థానంలో ‘సీ అండ్ ఓ’ డెస్క్‌ను పెట్టించారు. ఆ సీ అండ్ ఓ డెస్క్‌ను జార్జ్ బుష్ తదితర అమెరికా అధ్యక్షులు ఉపయోగించారని ట్రంప్ తెలిపారు. 1880లో బ్రిటన్ రాణి క్వీన్ విక్టోరియా ఈ రెసొల్యూట్ డెస్క్‌ను అప్పటి అధ్యక్షుడు రుథర్‌ఫోర్డ్‌కు బహుమతిగా ఇచ్చారు. మస్క్ కుమారుడు చీమడి రుద్దాడన్న కారణంగా ఇప్పుడు ట్రంప్ ఆ డెస్క్ మార్చిపారేశారు.