ఒట్టావా, నవంబర్ 4 : కెనడాలో ఖలిస్థాన్ వేర్పాటువాదుల చర్యలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఆదివారం ఒంటారియో రాష్ట్రం బ్రాంప్టన్లో ఖలిస్థాన్ వేర్పాటువాదులు ఓ హిందూ ఆలయంపై దాడికి తెగబడ్డారు. ఖలిస్థాన్ జెండాలు చేతబూని.. ఆలయం వద్ద జరుగుతున్న హిందువుల సభపైకి దూసుకెళ్లారు. అందర్నీ భయభ్రాంతులకు గురిచేస్తూ.. సభకు హాజరైన హిందూ భక్తులపై దాడి చేసి ఇష్టమొచ్చినట్టు కొట్టారు. మహిళలను, పిల్లలను సైతం వేర్పాటువాదులు వదల్లేదని ‘హిందూ కెనడియన్ ఫౌండేషన్’ పేర్కొన్నది. కెనడాలో ఖలిస్థాన్ మద్దతుదారులతోనే ఇదంతా జరుగుతున్నదని ఆరోపించింది. ఈ ఘటన కెనడాలో తీవ్ర కలకలం రేపింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సహా వివిధ రాజకీయ నాయకులు ఘటనను ఖండించారు. దాడికి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షిస్తామని బ్రాంప్టన్ మేయర్ ప్యాట్రిక్ బ్రౌన్ ప్రకటించారు. భక్తులపై దాడికి తెగబడటాన్ని కెనడా విపక్ష నేత పియెర్రి పొలివ్రీ తీవ్రంగా ఖండించారు. హిందువులకు భద్రత కల్పించటంలో కెనడా ప్రభుత్వం విఫలమైందని టొరొంటో ఎంపీ కెవిన్ వోంగ్ అన్నారు. ‘బ్రాంప్టన్ దాడి ఎంతమాత్రమూ ఆమోదనీయం కాదు. కెనడాలోని ప్రతి పౌరుడూ స్వేచ్ఛగా, సురక్షితంగా తన మత విశ్వాసాల్ని పాటించే హక్కు ఉంది’ అని ప్రధా ని జస్టిన్ ట్రూడో ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. హిందువులపై దాడిని కెనడా ఎంపీ చంద్ర ఆర్య తీవ్రంగా ఖండించారు. ఖలిస్థాన్ వేర్పాటువాదులు రెడ్ లైన్ దాటారని అన్నారు. ‘ఖలిస్థాన్ వేర్పాటువాదుల తీవ్రవాదం కెనడాలో ఎంత నిస్సిగ్గుగా మారిందో తాజా ఘటన చూపుతున్నది. చట్టాల్ని అమలుజేసే ఏజెన్సీల్లో ఖలిస్థానీలు చొరబడ్డారన్న నివేదికల్లో నిజం ఉంది’ అని అన్నారు.
బ్రాంప్టన్ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దాడులు, వేధింపులతో కెనడాలో భారత దౌత్య అధికారులను బెదిరించలేరని స్పష్టం చేసింది. కెనడాలో భారత పౌరుల భద్రత, రక్షణ ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేసింది. సోమవారం భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైస్వాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. కెనడాలోని హిందూ ఆలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని జస్టిన్ ట్రూడో సర్కార్ను కోరారు. దాడి వెనుక భారత వ్యతిరేక శక్తులున్నాయని ఒట్టావాలోని భారత హైకమిషన్ కార్యాలయం పేర్కొన్నది. దాడి ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.
బ్రాంప్టన్లో హిందూ భక్తులపై దాడి ఘటనను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. కెనడాలో భారత దౌత్యవేత్తలను బెదిరించేందుకు పిరికిపందలు చేసిన ప్రయత్నంగా ప్రధాని పేర్కొన్నారు. న్యాయబద్ధమై, చట్టబద్ధమైన పాలనను అందించేందుకు కట్టుబడి ఉండాలని కెనడా ప్రభుత్వానికి సూచించారు. ఇలాంటి హింసాత్మక చర్యలతో భారత్ ైస్థెర్యాన్ని దెబ్బతీయలేరని అన్నారు.