న్యూఢిల్లీ: న్యూయార్క్ కోర్టు ఎదుట హాజరైన పదవీచ్యుత వెనెజువెలా అధ్యక్షుడు మదురో తనను తాను యుద్ధ ఖైదీగా ప్రకటించుకుని తనను అమెరికా ప్రభుత్వం అరెస్టు చేయడంలోని చట్టబద్ధతను సవాలు చేశారు. అమెరికా తనపై నమోదుచేసిన అభియోగాల్లోని డొల్లతనాన్ని ఆయన ప్రశ్నించారు. వెనెజువెలా రాజధాని కారకాస్‌లో మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ని అదుపులోకి తీసుకున్న అమెరికా డెల్టా ఫోర్సు తమ దేశానికి తరలించి సోమవారం న్యూయార్క్‌లోని కోర్టులో హాజరుపరిచింది. అమెరికా ప్రభుత్వం తనపై మోపిన నార్కో ట్రెరరిజం, కొకైన్ అక్రమ రవాణా, కుట్ర అభియోగాలను తోసిపుచ్చిన మదురో.. తాను నిరపరాధినని న్యాయమూర్తికి తెలిపారు. తాను నేరస్థుడిని కానని స్పష్టం చేసిన మదురో తనను సైనిక ఆపరేషన్‌లో కిడ్నాప్ చేసినట్లు చెప్పారు. చట్టపరంగా తనను అరెస్టు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. దీని ద్వారా తన అరెస్ట్‌ను యుద్ధ చర్యగా పరిగణించాలే తప్ప చట్టపరమైన చర్యగా కాదని ఆయన సందేశం పంపించినట్లయింది.