కక్ష్య తప్పకుండా ఉండేందుకు మార్గాలు అన్వేషిస్తున్న అమెరికా
ఏరోస్పేస్ సంస్థల సహకారం తీసుకునే యోచనలో నాసా
వాషింగ్టన్, మార్చి 1: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నిర్వహణలో తమ సహకారం లేకుంటే అది కక్ష్య తప్పి భారత్, చైనా లేదా అమెరికా, ఐరోపా దేశాల్లో పడొచ్చని రష్యా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో ఆ దేశం సహకారం లేకుండా ఐఎస్ఎస్ నిర్వహణపై అమెరికా దృష్టి పెట్టింది. రష్యా సాంకేతిక సాయం లేకుండా ఐఎస్ఎస్ను కక్ష్య తప్పకుండా ఉండేలా చూసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) మార్గాలు అన్వేషిస్తున్నది. దేశంలోని ఏరోస్పేస్ సంస్థ ‘నార్త్రోప్ గ్రుమ్మాన్’ రీబూస్ట్ సామర్థ్యాన్ని ఆఫర్ చేసిందని నాసా మానవ అంతరిక్ష ప్రయాణ కార్యక్రమ అధిపతి కాథీ లూడర్స్ పేర్కొన్నారు. సహకరించేందుకు స్పేస్ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ కూడా సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపారు. అయితే ఐఎస్ఎస్ నిర్వహణలో భాగస్వామ్యపక్షాలు కట్టుబడి లేరని చెప్పేందుకు దాని నిర్వహణలో ఎటువంటి మార్పులు కనిపించలేదని, అయినప్పటికీ మరింత నిర్వహణ సౌలభ్యం కోసం ఎప్పుడూ చూస్తూ ఉంటాం అని చెప్పారు.
అమెరికా, రష్యాల కీలకపాత్ర
ఐఎస్ఎస్ నిర్వహణలో అమెరికాతో పాటు రష్యాది కీలక పాత్ర. అమెరికా పవర్, లైఫ్ సపోర్టు అందిస్తుండగా.. ఐఎస్ఎస్ నిర్దేశిత కక్ష్యలో తిరిగేందుకు ప్రొపల్షన్ వ్యవస్థను రష్యానే అందిస్తున్నది. ఉక్రెయిన్పై దాడి నేపథ్యంలో అమెరికా రష్యాపై ఆర్థిక ఆంక్షలతో అంతరిక్ష కార్యక్రమాలకు సంబంధించిన టెక్నాలజీ బదిలీలపై కూడా నిషేధించింది. దీనిపై రష్యా అంతర్జాతీయ పరిశోధనా సంస్థ చీఫ్ దిమిత్రీ రొగొజిన్ ఘాటుగా స్పందించారు. ఐఎస్ఎస్ నిర్వహణ భాగస్వామ్యం నుంచి రష్యా తప్పుకునే అంశాన్ని లేవనెత్తారు. ‘మీరు రష్యాకు సహకారాన్ని నిరోధించినట్లయితే.. ఐఎన్ఎస్ను ఎవరు రక్షిస్తారు? ఇది కక్ష్య తప్పకుండా.. అమెరికా, యూరప్లపై పడకుండా ఎవరు కాపాడుతారు? దాదాపు 500 టన్నుల బరువుండే ఐఎస్ఎస్ భారత్, చైనాలపై కూడా పడే అవకాశం ఉన్నది’ అని హెచ్చరించారు. మరోవైపు రష్యాతో చేపట్టాల్సిన రోదసీ ప్రయోగాలను ఈయూ రద్దు చేసింది. రష్యాలో సినిమాలు విడుదల చేయబోమని హాలీవుడ్ నిర్మాణ సంస్థలు ప్రకటించాయి.