సోమవారం 18 జనవరి 2021
International - Jan 08, 2021 , 09:47:36

హెచ్‌-1బీ వీసా: లాట‌రీ ప‌ద్ధ‌తికి గుడ్‌బై

హెచ్‌-1బీ వీసా: లాట‌రీ ప‌ద్ధ‌తికి గుడ్‌బై

వాషింగ్ట‌న్‌: హెచ్‌-1బీ వీసా ఎంపిక ప్ర‌క్రియ‌లో మార్పులు తీసుకొస్తున్న‌ట్లు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్‌ అమెరికా గురువారం ప్ర‌క‌టించింది. లాట‌రీ ప‌ద్ధ‌తికి స్వ‌స్తి చెప్పి జీతం, నైపుణ్యం ఆధారంగా ఈ వీసాలు ఇవ్వ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. అమెరికా ఉద్యోగుల ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకోవ‌డంతోపాటు కేవ‌లం ఎంతో నైపుణ్యం ఉన్న విదేశీ వ‌ర్క‌ర్లే ఈ వీసాల వ‌ల్ల ప్ర‌యోజ‌నం పొందే ఉద్దేశంతో ఈ మార్పులు చేయ‌నున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. శుక్ర‌వార‌మే దీనికి సంబంధించిన తుది నిబంధ‌న‌ను ఫెడ‌రెల్ రిజిస్ట‌ర్‌లో ప‌బ్లిష్ చేయ‌నున్నారు. ఆ త‌ర్వాత 60 రోజుల‌కు ఇది అమ‌ల్లోకి వ‌స్తుంది. ఏప్రిల్ 1 నుంచి మ‌రోసారి హెచ్‌-1బీ వీసా ఫైలింగ్ సీజ‌న్ ప్రారంభ‌మ‌వుతుంది. 

ఇండియా, చైనా వాళ్లే ఎక్కువ‌

హెచ్‌-1బీ అనేది నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా. దీని ద్వారా అమెరికా కంపెనీలు ప్ర‌తి ఏటా వేలాది మంది విదేశీ వ‌ర్క‌ర్ల‌ను రిక్రూట్ చేసుకుంటాయి. ప్ర‌త్యేకమైన సాంకేతిక నైపుణ్యం క‌లిగిన వారినే తీసుకుంటారు. ముఖ్యంగా ఇండియా, చైనాల నుంచే ఏటా వేలాది మంది హెచ్‌-1బీ వీసాల‌పై అమెరికా వెళ్తుంటారు. ఇప్పుడీ వీసా జారీ ప్ర‌క్రియ‌ను మార్చ‌డం వ‌ల్ల అమెరికా కంపెనీలు మ‌రింత నైపుణ్యం ఉన్న ప్రొఫెష‌న‌ల్స్‌ను భారీగా జీతాలు చెల్లించి తీసుకోవాల్సి వ‌స్తుంది. చాలా రోజులుగా కంపెనీలు ఈ హెచ్‌-1బీ వీసాల‌ను దుర్వినియోగం చేస్తున్నాయ‌ని, కేవ‌లం ఎంట్రీ లెవ‌ల్ ఉద్యోగుల‌ను తీసుకోవ‌డానికి వీటిని వాడుతున్నార‌ని యూఎస్‌సీఐఎస్ డిప్యూటీ డైరెక్ట‌ర్ ఫ‌ర్ పాల‌సీ జోసెఫ్ ఎడ్లో అన్నారు. 

ఏడాదికి 65 వేల వీసాలు

అమెరికా కాంగ్రెస్ ఏడాదికి జారీ చేసే హెచ్‌-1బీ వీసాల‌పై పరిమితి విధించింది. దీని ప్ర‌కారం యూఎస్‌సీఐఎస్ ఏడాదికి గ‌రిష్ఠంగా 65 వేల హెచ్‌-1బీ వీసాలు మాత్ర‌మే జారీ చేస్తుంది. STEM స‌బ్జెక్టుల‌లో అమెరికా యూనివ‌ర్సిటీలో ఉన్నత చ‌దువులు పూర్తి చేసిన విదేశీ విద్యార్థుల‌కు అద‌నంగా 20 వేల హెచ్‌-1బీ వీసాల‌ను జారీ చేస్తారు.