వాషింగ్టన్: ఒక మహిళ నాలుగుసార్లు క్యాన్సర్ మహమ్మారితో పోరాడి ప్రాణాలు దక్కించుకున్నది. అయితే ఇంట్లో ఉన్న ఆమెకు కిటికీ నుంచి దూసుకొచ్చిన బుల్లెట్ తగలడంతో మరణించింది. (US Woman) అమెరికాలోని కొలరాడోలో ఈ సంఘటన జరిగింది. బెర్తౌడ్ పట్టణంలో నివసించే 49 ఏళ్ల జెన్నిఫర్ జేమ్స్ నాలుగు సార్లు క్యాన్సర్ బారిన పడింది. 29 ఏళ్ల వయసులో తొలుత రొమ్ము క్యాన్సర్‌తో బాధపడింది. దాని నుంచి కోలుకున్న తర్వాత మరో మూడుసార్లు క్యాన్సర్ బారిన పడింది. నలుగురు పిల్లల తల్లి అయిన ఆమె గత 20 ఏళ్లుగా క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్నది. భర్తకు దూరంగా ఉంటున్న జెన్నిఫర్ జేమ్స్, తన పిల్లల కోసం ‘గోఫండ్‌మీ’ ద్వారా ప్రచారం చేపట్టింది. ఇప్పటి వరకు 63,505కు పైగా డాలర్లు (సుమారు రూ.55 లక్షలు) సమకూరాయి.
కాగా, ఏప్రిల్ 28న జెన్నిఫర్ జేమ్స్ ఇంట్లో ఉండగా కిటికీ నుంచి బుల్లెట్ చొచ్చుకొచ్చింది. ఆమె ఛాతిలోకి అది దూసుకెళ్లింది. బుల్లెట్ గాయంతో బాధపడుతూనే 911కి కాల్ చేసిన ఆమె ఇంట్లో కుప్పకూలి మరణించింది. పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. జెన్నిఫర్ జేమ్స్ ఇంటి బయట బుల్లెట్ పేల్చిన 20 ఏళ్ల ఎబెనెజర్ వర్క్‌ను అరెస్టు చేశారు.
మరోవైపు తాను అనుకోకుండా హ్యాండ్‌గన్ ఫైర్ చేసినట్లు పోలీసులకు నిందితుడు తెలిపాడు. కర్టెన్లు మూసి ఉన్న ఆ ఇంటి గోడలకు బుల్లెట్ తగిలి ఉంటుందని భావించినట్లు చెప్పాడు. అయితే పోలీసులు అతడిపై తీవ్రమైన నేరాపణలు మోపారు. కాగా, జెన్నిఫర్ జేమ్స్ కుమార్తె ఆష్లే, స్థానిక మీడియా ఎదుట తన బాధను వ్యక్తం చేసింది. ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదని వాపోయింది.